ఎంతోమందికి రాజకీయ పునాది వేసినవి గ్రేటర్ ఎన్నికలే. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలు తొలుత నగరం నుంచి కార్పొరేషన్ ఎన్నికల ద్వారా ప్రస్థానాన్ని ఆరంభించినవారే. 2016 ఎన్నికల్లో దాదాపు 1300 మందికి పైగా అభ్యర్థులు అన్ని పార్టీల నుంచి పోటీకి దిగారు. ఇందులో కొందరికే కుటుంబపరంగా రాజకీయ నేపథ్యం ఉంది. మిగతావారంతా నేతల అనుచరులు, సాధారణ వ్యక్తులే. ఈ దఫా కూడా అన్ని పార్టీల నుంచి ఆశావహులు రంగంలోకి దిగుతున్నారు. భవిష్యత్తులో నేతలుగా ఎదగాలంటే కొత్త వారికి ఈ ఎన్నికలే మొదటి మెట్టుగా భావించాలి. గెలిచినా...ఓడినా ఇక్కడితో అయిపోయిందని అనుకోకూడదు.
కార్పొరేటర్‌గా ఓడిన చాలామంది తర్వాత ఎమ్మెల్యే అయి మంత్రులుగా కూడా కొనసాగారు. నిబద్ధత, విశ్వసనీయత, నిజాయతీ, కష్టపడే తత్వం, సామాజిక సమస్యలపై క్షేత్రస్థాయి అవగాహన, జవాబుదారీ తనం, నాయకత్వలక్షణాలు, వ్యుహ ప్రతివ్యూహాలు తదితర లక్షణాలు ఉంటే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం పెద్దకష్టం కాదు. పైసలు ఖర్చుపెడితే చాలు అనే ధోరణి మంచిది కాదు. ఓడిపోయినా నలుగురు తమ వెంట ఉండడమే కీలకం.. రాజకీయాల్లో స్థిరపడాలనుకునే వారికి కొన్ని లక్షణాలు తప్పకుండా ఉండాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం...
కలుపుకొనే తత్వం:ప్రజలతో సత్సబంధాలు లేని వ్యక్తులు నేతలుగా ఎదగడం అరుదు. నాయకుడికి అన్ని వర్గాలను కలుపుకొనిపోయే తత్వం ఉండాలి. ముఖ్యంగా అట్టడుగు ప్రజలతో మమేకమైనవారికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుస్తాయి. నిత్యం వారితో మాట్లాడటం వల్ల ఇతను తమవాడే అనే విషయం వారికి అవగతమవుతుంది. ఇందుకు కార్పొరేషన్ ఎన్నికలు ఒక అవకాశం. గెలిచినా, ఓడిచినా భవిష్యత్తులో వారి తరఫున నిలబడితే గుర్తింపు తప్పకుండా ఉంటుంది.