రాష్ట్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే దిశగా సర్కారు చర్యలు చేపట్టింది. ఈ మేరకు నూతన ఆస్పత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నలుమూలల తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-టిమ్స్ పేరుతో ఆస్పత్రులను నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ సహా...ఎల్బీ నగర్ పరిధిలోని గడ్డిఅన్నారం, సనత్ నగర్ చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణం, అల్వాల్‌లో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఇప్పటికే ఆస్పత్రుల నిర్మాణానికి 2 వేల 679 కోట్లు మంజూరు చేయగా...ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా నేడు భూమిపూజ నిర్వహించనున్నారు.
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో ఆస్పత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఫలితంగా వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసిన వైద్యారోగ్యశాఖ.. ఇందుకు తగిన ఏర్పాట్లు ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఆస్పత్రులకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అల్వాల్ ఆస్పత్రి కోసం 28.41 ఎకరాలు కేటాయించగా...అక్కడ G ప్లస్ 5 అంతస్తుల్లో భవనం రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం 897 కోట్లు సర్కారు కేటాయించింది. ఎల్బీనగర్ గడ్డి అన్నారం వద్ద 21.36 ఎకరాల విస్తీర్ణంలో...14 అంతస్తుల్లో నిర్మించేందుకు 900 కోట్లు కేటాయించింది. సనత్ నగర్ లోని చెస్ట్ ఆస్పత్రి ప్రాంగణంలో 17 ఎకరాల్లో...14 అంతస్తుల భవనం నిర్మించనుంది. ఇందుకోసం సర్కారు 882 కోట్లు మంజూరు చేసింది.