శీతాకాలంలో ఏర్పడే పొగమంచు వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ వాతావరణంలో రైళ్లు నడిపేటప్పుడు లోకో పైలట్లకు దారిలో వచ్చే స్టేషన్లు, సిగ్నల్స్ సరిగా కనిపించక తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. రైలువేగం తగ్గించడం వల్ల సమయపాలనకు భంగం వాటిల్లుతోంది. సమస్య పరిష్కారానికి దక్షిణ మధ్యరైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.
మంచులోను.. ముందుచూపు..
లోకోపైలట్ల కోసం దృశ్య శ్రవణ యంత్రాలతో కూడిన.. గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్- జీపీఎస్ ఆధారిత ఫాగ్‌పాస్ పరికరాలు తయారుచేశారు. ఆ పరికరాలు జీపీఎస్ ఆధారంగా పనిచేస్తూ రైళ్లు నడిపేటప్పుడు మంచువాతావరణంలోనూ దారిస్పష్టంగా కనిపించేలాచేస్తాయి. రానున్న 3 లోకేషన్లను దూరాన్ని చూపించడంతోపాటు.. 500 మీటర్ల ముందే లోకోపైలెట్లను ఈ ఫాగ్‌పాస్ హెచ్చరిస్తుంది.
జీపీఎస్ ఫాగ్‌పాస్ ప్రత్యేకత
రైలు ప్రయాణిస్తున్న సెక్షన్‌లో సిగ్నల్స్, స్టేషన్లు, లెవెల్ క్రాసింగ్ గేట్లు, హెచ్చరికబోర్డులు, మలుపులను స్పష్టంగా జీపీఎస్ మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దృశ్యంతో పాటు శబ్దం వినే సౌలభ్యం కూడా ఉంది.