వర్షాలు తగ్గినప్పటికీ తిరుపతి(Flood Water in Tirupati) నగరానికి వరద ముప్పు కొనసాగుతోంది. మూడు రోజులపాటు కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. కొన్ని కోట్ల చెరువు కట్టలు తెగి నగరంలోకి వరదనీరు చేరుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కొంతమేర ఇబ్బందులు ఎదురువుతున్నాయి. వరద ప్రభావంతో తిరుమల కాలినడక మార్గమైన శ్రీవారి మెట్టు ప్రాంతం పూర్తిగా(Tirupati floods latest news) దెబ్బతింది. అలిపిరి కాలినడక మార్గం పాక్షికంగా దెబ్బతినడంతో.. భక్తులను కాలినడక మార్గాల ద్వారా అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో ద్విచక్రవాహనాలు మినహా.. భక్తులను ఇతర వాహనాలపై అనుమతిస్తున్నారు. వరదప్రభావంతో రైళ్లు, బస్సులను రద్దు చేయగా.. మరి కొన్నింటిని దారిమళ్లించారు. ఆర్టీసీ బస్సులను దారిమళ్లించి తిరుమల, తిరుపతికి నడుపుతున్నారు.
ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటితో ఇంకా పలు కాలనీలు(Several Colonies Waterlogged ) జలదిగ్బంధంలోనే ఉన్నాయి. నగరంలోని మహిళా యూనివర్సిటీ, శ్రీ కృష్ణ నగర్, గాయత్రీ నగర్, ఎంఆర్ పల్లి, సరస్వతీ నగర్, గాంధీపురం, లింగేశ్వరకాలనీ, ఆటోనగర్తోపాటు పలు కాలనీల్లోని ఇళ్లకు వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతంలోని పేరూరు, పెరుమాళ్లపల్లి చెరువులు నిండిపోవడంతో తిరుపతి శివార్లలోని పలు ప్రాంతాల్లోకి వరద పోటెత్తింది. ఇళ్లలోకి నీరు రావడంతో తాగునీరు, తిండిలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి కంటి మీద కునుకు లేకుండా తీవ్ర అవస్థలు పడుతున్నారు. జలదిగ్బంధంలోని కాలనీలకు ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.
అండగా నిలుస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్...
మరో పక్క జలదిగ్బంధంలో ఉన్న నగరవాసుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలించింది. పాలు, బ్రెడ్, ఆహార పానియాలను ట్రస్ట్ సభ్యులు అందజేశారు. ముంపునకు గురైన ప్రాంతాలలో పూర్తి స్థాయిలో బాధితులకు సాయం అందక ఇబ్బందులు పడుతుంటే.. ముంపు నుంచి బయట పడిన ప్రాంతాల వాళ్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తమవైపు చూడలేదని వాపోతున్నారు. వరదలో ఇంట్లో వస్తువులతో పాటు సర్వం కోల్పోయామని కన్నీటిపర్యంతమవుతున్నారు. కనీసం వీధుల్లో పేరుకుపోయిన బురద, కొట్టుకొచ్చి వస్తువులను తొలగించాలని కోరుతున్నారు.