ఏపీలోని తిరుమల కొండపైనే సామాన్య భక్తులకు లడ్డూల కొరత ఉంటే.. చంద్రగిరి, పాకాల మండలాల్లోకి ఇన్ని లడ్డూలు ఎలా వస్తున్నాయన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పాకాల, మొగరాల, ఉప్పరపల్లితోపాటు చంద్రగిరి, తొండవాడ, తిరుచానూరు, ముంగిలిపట్టుల్లో ఓటర్ల ఇళ్లకు పదుల సంఖ్యలో లడ్డూలు అందాయి. తితిదే ఇటీవల ఒక్కో భక్తుడికి ఒక్క లడ్డూ మాత్రమే ఉచితంగా ఇస్తూ.. ఆపై ఒక్కో లడ్డూకు రూ.50 చొప్పున వసూలు చేస్తోంది. ఈ అదనపు ప్రసాదంపై నిర్దిష్టంగా పరిమితి విధించకపోయినా.. వందల కొద్ది కొనుగోలు చేసే వీల్లేదు. 22 వేల మంది ఓటర్లున్న తిరుచానూరు గ్రామంలో సగం కుటుంబాలకు పెద్ద లడ్డూ, వడ అందినట్లు సమాచారం.
ఎలా వచ్చాయి?
ఇక్కడ 11 వేల పెద్ద లడ్డూలు, అదే సంఖ్యలో వడలు అందించాలంటే.. తితిదే యంత్రాంగం సహకారం లేకుండా సాధ్యం కాదని, దీని వెనుకాల ఎవరున్నారన్నది తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లడ్డూలపై పరిమితి లేకపోయినా.. వడలు మాత్రం కౌంటర్ వద్ద ఒక్కో భక్తుడికి రెండు మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ ఇన్నేసి వడలు ఎలా వచ్చాయి? అధికార పార్టీకి చెందిన నేతలు చెబితే ఇచ్చారా? వంటి పలు సందేహాలు తలెత్తుతున్నాయి.