తెలంగాణ

telangana

ETV Bharat / city

ఒత్తిడిని జయించేందుకు.. వారంలో ఒకరోజు...

కాలంతో పాటు వేగంగా కదలక తప్పదు. అలా అని ఉరుకులు పరుగులుగా సమయం గడిపేస్తే.. మనసొప్పదు. అందుకే... వారాంతం వచ్చిందంటే చాలు..! నచ్చిన పని చేస్తూ... ప్రశాంతంగా ఉండాలని అంతా అనుకుంటారు. ఆంధ్రప్రదేశ్​ తిరుపతిలోని ఓ బృందం కూడా ఇలాగే ఆలోచించింది. పని ఒత్తిడిని జయించాలంటే...ఒక్కటే దారి. అదే... ప్రకృతికి దగ్గరవటం. సరిగ్గా ఈ సూత్రాన్నే తమ లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ బృందం. వృత్తి జీవితంలో ఎంత తీరిక లేకుండా ఉన్నా.. వారాంతాలను మాత్రం పూర్తిగా తమ అభిరుచికే కేటాయిస్తున్నారు. ప్రకృతి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తూ బాధల్ని మర్చిపోతున్నారు. వైవిధ్యమైన ఫొటోలు తీస్తూ...వాటితోనే డాక్యుమెంటరీలు చేస్తూ...సెలవు రోజుల్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.

By

Published : Dec 28, 2020, 11:02 PM IST

tirupathi-photography-habits-news
ఒత్తిడిని జయించేందుకు.. వారంలో ఒకరోజు..

ఒత్తిడిని జయించేందుకు.. వారంలో ఒకరోజు..

అప్పుడప్పుడే తెల్లవారుతోంది. కమ్ముకున్న పొగమంచును చీల్చుకుంటూ ఓ బృందం సన్నద్ధమైంది. రయ్ మంటూ వారి బైక్‌లు పల్లెల దిశగా సాగాయి. పచ్చనిపొలాలు... హాయిని పంచే ప్రకృతి.. సెలవు రోజుని ఆనందంగా గడిపేందుకు ఇంతకంటే ఏం కావాలి..? వెంటనే తమ కెమెరాలకు పని చెప్పింది ఈ బృందం. చకచకా ఫొటోలు తీస్తూ... ఆ ఉదయాన్ని ఎంతో ఉల్లాసంగా..ఉత్సాహంగా ఆహ్వానించింది.

  • వీరందరినీ ఏకం చేసిన ఫొటోగ్రఫీ క్లబ్ ఏపీలోని తిరుపతి

వారాంతాలు వచ్చాయంటే... ఇలా ఒక్కటై ప్రకృతి ఒడిలోనే గడిపేస్తారు. వీరిలో ఇంజనీర్లు, వైద్యులు, విద్యార్థులు..ఇలా భిన్న నేపథ్యాలకు చెందిన వారున్నారు. అయినా..వీరందరి ప్రవృత్తి మాత్రం ఫొటోగ్రఫీయే. వయసు, వృత్తితో సంబంధం లేకుండా ఈ అభిరుచి ఉన్న వాళ్లు వీరితో పాటు విహార యాత్రలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమకు నచ్చిన విధంగా ఫొటోలు తీయటం..వాటిని డాక్యుమెంటరీలుగా మలచటమే వీరు చేసే పని. ఆ లక్ష్యమే వీరందిరినీ ఏకం చేసింది.

  • విభిన్న రకాలు ఫొటోగ్రఫీల్లో రాణిస్తూ..

స్ట్రీట్, ఆస్ట్రో, నేచర్, ఫుడ్, ఫైన్ ఆర్ట్స్, లాండ్ స్కేప్, వైల్డ్ లైఫ్ అంటూ విభిన్న రకాల ఫొటోగ్రఫీల్లో రాణిస్తున్న వారున్నారు. ఇలా తలో దారిలో ప్రయాణాన్ని ప్రారంభించిన వారికి ఒకే వేదిక కల్పిస్తే ఎలా ఉంటుంది...? ఈ ఆలోచనే చేశారు అవినాష్, హనీష్. వైద్య విద్యను అభ్యసిస్తున్న అవినాష్, ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రాఫర్​గా పేరు తెచ్చుకున్న హనీష్.. ఏడాది క్రితం ఫొటోగ్రఫీ క్లబ్ తిరుపతిని ప్రారంభించారు. ఔత్సాహిక, ప్రొఫెషన్ల ఫొటోగ్రాఫర్లను ఒక్క చోట చేర్చేలా ఓ వేదిక ఏర్పాటు చేశారు. తరచూ ఫొటో వాక్ లు, వర్క్ షాప్ లు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే...ఈ వారాంతపు ఫొటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు.

  • ఒత్తిడిని దూరం చేసేలా...

దైనందిన ఒత్తిడిని దూరం చేసేలా వారాంతాల్లో యాత్రలు నిర్వహించాలనే ఆలోచన చేసిన సమయంలోనే కరోనా విజృంభించింది. ఫలితంగా...దాదాపు ఎనిమిది నెలలపాటు ఇంటికే పరిమితమైపోయారు. ఇన్నాళ్ల తర్వాత తిరిగి ఈ బృంద సభ్యులంతా కలుసుకున్నారు. అందమైన ప్రాంతాలను సందర్శించటంతో పాటు పరిసర గ్రామాల ప్రజలతో ఆనందంగా గడిపారు. పల్లె వాసులతో మాట్లాడుతూనే...అక్కడి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు తీయటం వీరి ప్రత్యేకత. ఇక పక్షులు, పచ్చని పొలాలు, లేగదూడలు... ఇలా అన్నింటినీ తమ కెమెరాల్లో బంధిస్తూ...ముందుకు సాగిపోతుంటారు.

ప్రకృతి కలిగించే ప్రశాంతతే వేరు

మనిషికి ప్రకృతి కలిగించే ప్రశాంతతే వేరు. గలగలపారే సెలయేళ్ల సవ్వడి వింటే ధ్యానం చేసినట్టే. అంతటి హాయినిచ్చే ప్రదేశంలో ఫొటోగ్రఫీ క్లబ్ సభ్యులు ఎన్నో అందమైన ఫొటోలు తీస్తారు. ఒకరికొకరు తాము తీసిన ఫొటోలు చూపిస్తూ అభిప్రాయాలు తెలుసుకుంటారు. మెళకువలు నేర్చుకుంటారు. ప్రతి ప్రదేశాన్నీ, దృశ్యాన్ని కెమెరా కళ్లతో చూస్తారు. ఎంత వైవిధ్యంగా ఫొటోలు తీయవచ్చు..? అందరి ఆలోచనా ఇదే. ఓ దృశ్యాన్ని చిత్రంగా మలిచే క్రమంలో ఎంత కష్టమైనా సరే ఇష్టంగానే భరిస్తాం.

- అవినాష్, వ్యవస్థాపకుడు, ఫొటోగ్రఫీ క్లబ్ తిరుపతి, హనీష్, వ్యవస్థాపకుడు, ఫొటోగ్రఫీ క్లబ్ తిరుపతి


రోజంతా ఉద్యోగం. ఎక్కడ లేని హడావుడి. ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కానీ నచ్చిన ఫొటోను తీసేందుకూ సమయం దొరకనంత పని ఒత్తిడి..! ఇలా బృందంగా ఏర్పడటం వల్ల ఇవన్నీ దూరమయ్యాయని చెబుతున్నారు..వీరు. ఒక్కొక్కరుగా వెళ్లటం కన్నా...ఇలా బృందంగా ఉండటం వల్ల వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోందని అంటున్నారు. తమలాంటి అభిరుచి ఉన్న వారితో...ప్రకృతిలో గడపుతూ...రోజంతా నచ్చిన పని చేస్తూ కొత్త అనుభూతులు పొందుతున్నారు. ఫొటోగ్రాఫర్‌లుగా రాణించాలంటే...ప్రోత్సాహంతో పాటు నైపుణ్యాలు అందించటమూ ఎంతో అవసరం. ఈ బృందంలో ఫొటోగ్రఫీయే వృత్తిగా ఉన్న వారు...కొత్త వారికి శిక్షణనిస్తూ...కొత్త ఉత్సాహం అందిస్తున్నారు.

వర్క్ షాప్ లు, ఫొటో వాక్ లు గతంలోనూ నిర్వహించినా...ఇలా ఓ బృందంలా బయటికి వచ్చి గడపటం ద్వారా ఎక్కువ నేర్చుకోగలుగుతున్నామని చెబుతున్నారు...ఈ సభ్యులు. రోజంతా...కనులకు, మనసుకు నచ్చిన ఫొటోలు తీసుకుంటూ...వాటిని చూసుకుంటూ మురిసిపోతారు. తిరిగి వారానికి సరిపడా ఉత్సాహాన్ని పొందుతారు. మొత్తంగా...సెలవు రోజులను సంతోషంగా గడుపుతున్నారు.

ఇదీ చదవండి:ఆ ఊర్లో అంతుచిక్కని వ్యాధి... 20 రోజుల్లో ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details