తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు(TIRUMALA TIRUPATHI BRAHMOTHSAVALU) సర్వం సిద్ధమైంది. ఉత్సవాలకు అంకురార్పణగా స్వామివారి సేనాధిపతి విశ్వక్ష్సేనులవారు తిరుచ్చిపై ఊరేగుతూ... ఏర్పాట్లను పరిశీలిస్తారు. అర్చకులు పుట్టమన్ను, నవ ధాన్యాలు సేకరించి వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం సాయంత్రం ముక్కోటి దేవతల్ని వేడుకలకు ఆహ్వానిస్తూ.. గరుడ పటాన్ని ఎగురవేస్తారు. దీనికోసం ఉపయోగించే దర్భను శేషాచల అటవీ ప్రాంతం నుంచి సేకరించి చాప, తాడు తయారు చేయించి శ్రీవారి ఆలయానికి చేర్చారు.
15న చక్రస్నానం
గురువారం రాత్రి పెద్దశేషవాహనంతో సప్తగిరీశుడి వాహనసేవలు ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజులపాటు వివిధ వాహనాలపై అభయప్రదానం చేయనున్న స్వామివారికి... 15న చక్రస్నానం నిర్వహిస్తారు. కరోనా ప్రభావంతో వాహన సేవలన్నీ ఆలయంలోని రంగనాయకుల మండపంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గరుడవాహన సేవనాడు ప్రభుత్వం తరఫున స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అదేరోజు తిరుగిరులపై కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు.