వారంరోజుల పాటు తిరుమలలో దర్శనం నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే తిరుపతి చేరుకుని టైమ్‌స్లాట్ టోకెన్లు తీసుకున్నవారికి ఈరోజు రాత్రి దర్శనం కల్పించి.. అనంతరం దర్శనాలు నిలిపివేస్తామని చెప్పారు.
శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుడికి కరోనా లక్షణాలు కనిపించటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు. అతని రక్త నమూనాలను పరీక్షల కోసం పంపించామని.. రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. వారం తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. స్వామివారికి నిర్వహించే కైంకర్యాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు.