ఆంధ్రప్రదేశ్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులను ఈ నెల 8 నుంచి అనుమతించనున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటిదాకా భక్తులను అలిపిరి టోల్గేట్ దగ్గర భద్రత సిబ్బంది భౌతికంగా తనిఖీ చేసేవారు. ఇకపై భక్తులే స్వయంగా తమ జేబులు పూర్తిగా బయటకు తీసి, మహిళలు హ్యాండ్‌బ్యాగులను తెరచి చూపించాలి. తితిదే సిబ్బంది హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్‌తో పరిశీలిస్తారు.
భక్తులు గమనించాల్సిన అంశాలు
- భక్తుల లగేజీ సహా వాహనాలను అలిపిరి దగ్గరే శానిటైజ్ చేస్తారు. దర్శనం టికెట్లు ఉన్నవారినే కొండపైకి అనుమతిస్తారు.
- అలిపిరి దగ్గర 12 వరుసల్లో ప్రవేశ మార్గాలుండగా.. శానిటైజేషన్‌కు వీలుగా ఒకరోజు ఆరు, మరుసటిరోజు మిగిలిన ఆరింటిని తెరిచి వాహనాలను అనుమతిస్తారు.
- ముందురోజు తిరుపతికి వచ్చి ఆధార్‌కార్డుతో పాటు ఐరిస్ ద్వారా సర్వదర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలి. ఉదయం 7.30 నుంచి రాత్రి 7.30 వరకు గంటల వారీగా కోటా మేరకు టికెట్లు వచ్చేలా సాఫ్ట్వేర్ మార్చారు.
- సర్వదర్శనం టికెట్లు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం, ఆర్టీసీ బస్టాండులోని కౌంటర్ల నుంచి పొందవచ్చు. రద్దీని బట్టి శ్రీనివాసంలోనూ కౌంటర్ తెరిచే అవకాశముంది.