తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విశ్వవ్యాప్తంగా పేరుంది. తిరుమలేశునికి నివేదనల కోసం ఎన్నో రకాల ప్రసాదాలు తితిదే తయారు చేయిస్తోంది. వీటిలో లడ్డూలకు భక్తకోటి నుంచి విశేష ఆదరణ ఉంది. స్వామివారి ప్రసాదం కోసం రాజులు, రాణులు ఎన్నో దానాలు చేశారు. 1803లో ఆలయంలో ప్రసాదాల విక్రయాన్ని అప్పటి మద్రాసు ప్రభుత్వం ప్రారంభించింది. లడ్డూ తయారీకి రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించారు. అది కాస్తా 1940లో లడ్డూగా రూపొందింది. నామమాత్రంగా ప్రసాదాలు తయారు చేస్తుండగా తితిదే పాలకమండలి 1950లో లడ్డూల తయారీని పెంచింది. వీటి తయారీకి వాడాల్సిన ముడిసరకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. ఈ దిట్టాన్ని భక్తుల సంఖ్యను బట్టి పెంచుకొస్తున్నారు.
తితిదే కొలమానాల ప్రకారం 5,100 లడ్డూల తయారీకి 185 కిలోల ఆవు నెయ్యి, 200కిలోల శెనగపిండి, 400కిలోల చక్కెర, 35కిలోల జీడిపప్పు, 17.5 కిలోల ఎండుద్రాక్ష, 10 కిలోల కలకండ, 5కిలోల యాలకులు అవసరం. నిత్యం లక్ష లడ్డూల తయారీ వరకు పోటులో సామర్థ్యం ఉంది. కొన్నేళ్ల కింద బూందీ పోటును వెలుపలికి తీసుకొచ్చిన అనంతరం నిత్యం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు లడ్డూల తయారీ పెరిగింది. లడ్డూలను రెండు రకాల పరిమాణంతో తయారు చేస్తున్నారు. కల్యాణం లడ్డూ పేరుతో పిలిచే ప్రసాదం బరువు 750 గ్రాములు, సాధారణ లడ్డూ బరువు 140 నుంచి 170 గ్రాములు ఉంటుంది. కల్యాణ లడ్డూను రూ.200, సాధారణ లడ్డూను రూ.50 వంతున తితిదే విక్రయిస్తోంది. శ్రీనివాసుని లడ్డూకి తితిదే పేటెంట్ హక్కులను సాధించుకుంది.