తెలంగాణ

telangana

ETV Bharat / city

Bramhotsavalu: బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న తిరుమల - తిరుమల తాజా వార్తలు

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు ముస్తాబవుతున్నాయి. కరోనా కారణంగా ఉత్సవాలు ఆలయంలో ఏకాంతంగా జరగనున్నప్పటికీ... ఆలయంతో పాటూ తిరువీధులను అందంగా తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్‌ దీపాలతో కటౌట్లను సిద్ధం చేస్తున్నారు.

Bramhotsavalu
Bramhotsavalu

By

Published : Oct 4, 2021, 9:57 AM IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 7నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావంతో ఏకాంతంగా ఆలయంలోని కల్యాణమండపంలో వాహన సేవలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ... ఉత్సవాల వేళ శ్రీవారి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ గోపురాలకు సున్నాలు వేస్తున్నారు. మాడవీధుల్లో దేవతా మూర్తుల ప్రతి రూపాలను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌ దీపాలతో భారీ కటౌట్‌లను తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవమూర్తులను ఊరేగించే వాహన సేవల పటిష్టతను పరిశీలిస్తున్నారు. వాటికి అవసరమైన మరమ్మతులను చేసి సిద్ధం చేస్తున్నారు. సూర్యప్రభ వాహనం పరిమాణం పెద్దగా ఉండడంతో.. ఆలయంలోకి తీసుకేళ్లేందుకు మహద్వారం వద్ద ఇబ్బందిగా మారడంతో.. ఆ ప్రాంతంలో పాత వెండి వాహన సేవను వినియోగించనున్నారు. తేరు రథాన్ని మరమ్మతులు చేసి... ప్రయోగాత్మకంగా కొంతదూరం ముందుకు లాగారు.

బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ.... మంగళవారం శ్రీవారి ఆలయంలో కొయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయాన్ని శుద్ధి చేస్తారు. 6 వ తేదీ సాయంత్రం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 7వ తేదీన మీన‌ ల‌గ్నంలో సాయంత్రం 5 గంటల 10 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్య ధ్వజారోహ‌ణం నిర్వహించనున్నారు. అదే రోజు రాత్రి నిర్వహించే పెద్దశేష వాహ‌న సేవతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 8 వ తేదీ ఉదయం చిన్న శేష వాహన సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహిస్తారు. 9 వతేదీ ఉదయం సింహ వాహ‌నంపైన స్వామి వారిని ఊరేగించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఉత్సవమూర్తులకు స్నప‌న‌తిరుమంజ‌నం నిర్వహిస్తారు. రాత్రి ముత్యపుపందిరి వాహ‌నంపై తిరుమలేశుడు అభయం ఇవ్వనున్నారు. 10 వ తేదీ ఉదయం క‌ల్పవృక్ష వాహ‌నంపై …. రాత్రి స‌ర్వభూపాల‌ వాహ‌నంపై స్వామి దర్శనమివ్వనున్నారు.

11 వ తేదీ ఉదయం మోహినీ అవ‌తారంలో కనిపించనున్నారు. అదే రోజు రాత్రి గ‌రుడ‌సేవ‌ నిర్వహిస్తారు . 12వ తేదీ ఉదయం హ‌నుమంత వాహ‌నంపై దర్శనమిస్తారు. సాయంత్రం స్వర్ణర‌థం బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద....రాత్రి గ‌జ వాహ‌నంపైనా విహరిస్తారు. 13వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహ‌నం మీద రాత్రి చంద్రప్రభ వాహ‌నంపైన స్వామి దర్శనమిస్తారు. 14న ఉదయం ర‌థోత్సవానికి బ‌దులుగా స‌ర్వభూపాల వాహ‌నం మీద అభయమిస్తారు. రాత్రి అశ్వ వాహ‌న సేవతో వాహన సేవలు ముగుస్తాయి.

15వ తేదీన చక్రస్నానంలో భాగంగా వేకువజామున ప‌ల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, స్నప‌న‌ తిరుమంజ‌నం, చ‌క్రస్నానం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి జరిగే ధ్వజావ‌రోహ‌ణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు సాగే వాహన సేవలను ఆలయంలోని కల్యాణమండపంలో కొలువుదీర్చి వైదిక కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు. అర్చకులు, ఆలయ సిబ్బంది వాహన సేవల్లో పాల్గొని ఉత్సవాలను నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి: TTD NEWS: తిరుమలలో డిపాజిట్ రిటర్న్ లేటవుతోంది.. ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details