రోజూ మీరు లేచే సమయం కంటే అరగంట ముందే నిద్రలేచి చూడండి. ఆరుబయటకు వెళ్లి చల్లగాలిని ఆస్వాదిస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దాంతో హాయిగా చదువుకోవడానికీ మనసు సిద్ధమవుతుంది. అంతే కాదు, మిగతా రోజులకంటే సమయం మిగలడంతో.. ఎప్పటినుంచో వాయిదా వేస్తోన్న అంశాలనూ ఉత్సాహంగా చదివేస్తారు.
చదువుకునే ప్రదేశాన్ని వీలైనంత పరిశుభ్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. పుస్తకాలూ, ఇతర వస్తువులూ చిందరవందరగా పడి ఉంటే మనసు కూడా గందరగోళంగా ఉంటుంది. చుట్టూ ఉండే పరిసరాలు చక్కగా ఉంటే చూడ్డానికే కాదు.. మనసుకూ హాయిగా ఉంటుంది. అలాంటి వాతావరణంలో గంటకొద్దీ కూర్చుని చదివినా విసుగు అనిపించదు.
మీ భావోద్వేగాలు, ఆలోచనలు, అభిప్రాయాలు... వీటిని అందరితోనూ పంచుకోలేరు. కాబట్టి డైరీలో వాటిని రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా రాసుకునేవాటిలో మీకు కోపం, సంతోషం, బాధ కలిగించిన సంఘటనలు ఏమైనా ఉండొచ్చు. రోజూ నిర్ణీత సమయంలో డైరీ రాసుకోవడం అలవాటు చేసుకుంటే ఇంకా మంచిది. ఆ సమయానికల్లా మనసులోని అలజడులకు అక్షరరూపం కల్పించి అదనపు బరువును దించుకుని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు కూడా.