Tiger in kakinada: కాకినాడ జిల్లాలో రాయల్ బెంగాల్ టైగల్ సంచారం ఒక చోటుకు పరిమితం కావడం లేదు. శనివారం రాత్రి వజ్రకూటం సమీపంలోని రెండు కొండల మధ్య ఆటోలో వెళ్తున్నవారి కంటపడి అలజడి రేపింది. వజ్రకూటం, రామన్నపాలెం, కత్తిపూడి గ్రామాల పరిధిలోని కొండల్లో పలుచోట్ల పులి పాదముద్రలు గుర్తిచారు. జాతీయ రహదారికి 5 కి.మీ. లోపే సంచరించడంతో యంత్రాంగంలోనూ మరింత ఆందోళన పెరిగింది. ఎన్‌ఎస్‌టీఆర్ డీఆర్‌వో ప్రసాద్‌రెడ్డి బృందం ఆ మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది.
20 రోజులుగా ఇక్కడే..:జిల్లా కేంద్రం కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గొల్లప్రోలు మండలాల మధ్య 20 రోజులుగా పులి సంచరిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి.
ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆకలికి మించి వేటాడని, బోనులో ఎరవేసినా.. లొంగని వ్యాఘ్రం ఇప్పటికే అయిదు పశువులను వధించింది. దాన్ని తిరిగి అడవిలోకి పంపాలనే మంత్రాంగాన్ని తిప్పికొడుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది.
ఎందుకు ఉందంటే..?
* పులి ఇన్ని రోజులు అటవీప్రాంత సమీప మైదానంలో తిష్ఠ వేయడానికి కారణాలను వన్యప్రాణి, అటవీ అధికారులు విశ్లేషించుకుంటున్నారు.
*పులి కౌమారదశకు చేరినపుడు అదో ప్రత్యేక భూభాగాన్ని (టెరిటరీ) ఖాయపరుచుకుంటుంది. మగ పులి 25 నుంచి 40 చ.కి.మీ. విస్తీర్ణాన్ని తన రాజ్యంగా భావిస్తుంది. తన కదలికలు, ఉంచే ఆనవాళ్లతో మిగతా జంతువులు పులి ఉనికిని గుర్తిస్తాయని చెబుతున్నారు. వేటకు అనువుగా ఉన్న పరిస్థితులను అది చూసుకుంటుంది.