తెలంగాణ

telangana

ETV Bharat / city

Judges Case: జడ్జిలను దూషించిన కేసులో మరో ముగ్గురు అరెస్ట్.. - జడ్జిలను దూషించిన వ్యక్తులు అరెస్టు

Judges Case: సామాజిక మాధ్యమాల్లో జడ్జిలను దూషిస్తూ పోస్టింగులు పెట్టారన్న అభియోగంపై ముగ్గురుని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు... ఏపీ గుంటూరు సీబీఐ న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న సీనియర్ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి, ఏపీ అసెంబ్లీ స్టాండింగ్‌ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్న మెట్ట చంద్రశేఖర్‌రావు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుంట రమేష్‌కుమార్​లకు సీబీఐ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీబీఐ ప్రత్యేకకోర్టు జడ్జి పొన్నూరు బుజ్జి ఎదుట ప్రవేశపెట్టారు.

Judges
Judges

By

Published : Feb 13, 2022, 11:58 AM IST

జడ్జిలను దూషించిన కేసులో మరో ముగ్గురు అరెస్ట్..

Judges Case: న్యాయవ్యవస్థను కించపరుస్తూ... న్యాయమూర్తులను అసభ్యకరంగా దూషిస్తూ, బెదిరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదైన కేసులో సీబీఐ మరో ముగ్గుర్ని శనివారం అరెస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి, ఏపీఈపీడీసీఎల్‌కి స్టాండింగ్‌ కౌన్సెల్‌గా వ్యవహరిస్తున్న న్యాయవాది మెట్ట చంద్రశేఖర్‌రావు (ఏ18), న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి (ఏ19), సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ గుంట రమేష్‌కుమార్‌ (ఏ20)లను శనివారం ఉదయం హైదరాబాద్‌లో సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో గుంటూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

విచారణకు హాజరుకావాలంటూ ఈనెల పదో తేదీనే ఈ ముగ్గురికీ సీబీఐ అధికారులు సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 41 ఏ నోటీసులు ఇచ్చారు. దీంతో వీరు శనివారం హైదరాబాద్‌ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. నిందితులు విచారణకు సహకరించట్లేదని పేర్కొంటూ వారిని అరెస్టు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత గుంటూరుకు తీసుకొచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో సీబీఐ ప్రత్యేకకోర్టు జడ్జి పొన్నూరు బుజ్జి ఎదుట హాజరుపరిచారు.

భారీ కుట్రలో వాస్తవాలు వెల్లడించట్లేదు..

న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులను దూషిస్తూ చేసిన వ్యాఖ్యలు, సామాజిక మాధ్యమ పోస్టుల వ్యవహారంలో చోటుచేసుకున్న భారీ కుట్రలో వాస్తవాల్ని నిందితులు విచారణలో వెల్లడించలేదని సీబీఐ పేర్కొంది. ఆ కుట్రను వెలుగులోకి తేవాలంటే వారిని కస్టడీకి తీసుకుని విచారించాలని పేర్కొంది. న్యాయమూర్తుల్ని దూషిస్తూ నిందితులు చేసిన వ్యాఖ్యల వెనక ఎవరున్నారు? వారిని ప్రభావితం చేసిన వ్యక్తులెవరు? ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు? మిగతా నిందితులతో వీరికి ఉన్న సంబంధాలేమిటి? తదితర అంశాల్ని రాబట్టాలని, అందుకు ఈ ముగ్గుర్నీ మూడురోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ డీఎస్పీ బి.పి.రాజు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు వీరి అరెస్టుకు దారితీసిన కారణాల్ని వివరిస్తూ మూడు వేర్వేరు రిమాండు రిపోర్టులను జడ్జి ఎదుట ఉంచారు.

క్షమాపణలు చెబుతూ గతంలో అఫిడవిట్‌..

న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ కొందరు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని, వ్యాఖ్యలు చేశారంటూ 2020 మే 26న ఏపీ హైకోర్టు కోర్టుధిక్కరణ కింద సుమోటోగా విచారణ చేపట్టింది. కేసు విచారణ సందర్భంగా మెట్ట చంద్రశేఖర్‌, గోపాలకృష్ణ కళానిధి హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ అఫిడవిట్లు దాఖలు చేశారు. భవిష్యత్తులో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోమని అందులో పేర్కొన్నారు. దీంతో వారిరువురిపై ఉన్న కోర్టుధిక్కరణ కేసును న్యాయస్థానం మూసేసింది.

ఇదీ చూడండి :IT Employees : ఏప్రిల్‌ నుంచి చలో ఆఫీస్‌... ఐటీ ఉద్యోగులకు కంపెనీల సందేశాలు

ABOUT THE AUTHOR

...view details