Stairs Up Lifting: అది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ప్రధాన కూడలిలో ఓ 3 అంతస్తుల భవనం. రహదారి కంటే తక్కువ ఎత్తులో ఉండటం వల్ల అందులోని లాడ్జి నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండేది. వ్యాపారాభివృద్ధి మీద దృష్టిపెట్టిన యజమాని, భవనాన్ని పునర్నిర్మించడం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాడు. అప్ లిఫ్టింగ్ ద్వారా భవనాన్ని నాలుగు అడుగులు పైకి లేపేందుకు చర్యలు చేపట్టారు.
చల్లపల్లిలోని మూడంతస్తుల మయూరి లాడ్జి భవనం అప్ లిఫ్టింగ్ పనులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రహదారి కంటే దిగువన ఉన్న లాడ్జి భవనానికి మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు యజమాని కాట్రగడ్డ రామ్మోహన్‌రావు లిఫ్టింగ్ విధానానికి మెుగ్గు చూపారు. విజయవాడ జేజే బిల్డింగ్ అప్ లిఫ్టింగ్ అండ్ షిఫ్టింగ్ సర్వీసెస్ వాళ్లను సంప్రదించారు. భవనం దెబ్బతినకుండా సుమారు 12 లక్షల రూపాయల ఖర్చుతో అప్ లిఫ్టింగ్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది.. బిల్డింగ్ కింద కాంక్రీట్ భాగాన్ని తొలగించి జాకీలు ఏర్పాటు చేసి, భవనాన్ని కొద్ది కొద్దిగా పైకి లేపుతున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఇటుకలు, సిమెంట్, కెమికల్ ఉపయోగించి గోడల నిర్మాణం చేస్తున్నారు.