రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు(Rains in Telangana) పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(hyderabad weather center) ప్రకటించింది. ఈరోజు ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపునకు కింది స్థాయి గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు పేర్కొన్నారు. నిన్నటి తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని తెలిపారు.
ఈరోజు ఉదయం 08.30 గంటలకు మధ్య నైరుతి, పరిసర పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో, చెన్నైకి తూర్పు-ఆగ్నేయ దిశలో సుమారు 130 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వివరించారు. ఇది సుమారు పశ్చిమ - వాయువ్య దిశగా కదిలి ఈరోజు సాయంత్రానికి ఉత్తర తమిళనాడు దానిని ఆనుకొని వున్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. మరొక అల్పపీడనం ఈ నెల 13న దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో ఏర్పడే అవకాశం వుందని సంచాలకులు వివరించారు.