తెలంగాణ

telangana

ETV Bharat / city

జీఎస్​డీపీకి లోబడే అప్పులు చేశాం: మంత్రి హరీశ్​ - ktr

రాష్ట్ర సరిహద్దులో ఉన్న మహారాష్ట్రకు చెందిన 40 మంది సర్పంచ్​లు తెలంగాణలో కలుస్తామని అంటున్నారంటే... మన పరిపాలనకు ఆ గుర్తింపు చాలదా అని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై శాసనమండలిలో మంత్రి సమాధానమిచ్చారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. రాష్ట్ర జీఎస్​డీపీ మెరుగ్గా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 75వేల కోట్ల అప్పులు ఉంటే..ఇప్పుడు కేవలం 1.28 లక్షల అప్పులు మాత్రమే అయ్యాయన్నారు.

జీఎస్డీపీకి లోబడే అప్పులు చేశాం: మంత్రి హరీశ్​

By

Published : Sep 23, 2019, 7:45 AM IST

జీఎస్​డీపీకి లోబడే అప్పులు చేశాం: మంత్రి హరీశ్​

వాస్తవాలకు అనుగుణంగా బడ్జెట్​ను పెట్టామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేంద్రం కంటే మెరుగైన స్థితిలో రాష్ట్ర జీఎస్​డీపీ ఉందన్నారు. 13 రాష్ట్రాలు.. జీఎస్​డీపీ కంటే అధికంగా అప్పులు చేశామని... మన రాష్ట్రం మాత్రం జీఎస్​డీపీకి లోబడే అప్పులు చేసిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఉన్నా సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఎటువంటి కోతలు విధించలేదని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతిపై అధికారులు కసరత్తు చేస్తున్నారన్నారు. యూనివర్సిటీలలో పూర్తిస్థాయి నియామకాలు చేపడతామన్నారు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలపై భాజపా నేతలు కోర్టులో కేసులు వేశారన్నారు. ఆర్టీసీలో సమస్యలు ఉన్నాయని.. ఆ సంస్థకు చెల్లించాల్సిన అప్పులు కూడా చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు.

మూడు బిల్లులు ఆమోదం

శాసనమండలిలో ఆదివారం మూడు బిల్లులు ఆమోదం పొందాయి. తెలంగాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు-2019, తెలంగాణ పురపాలక బిల్లు, ద్రవ్య వినిమయ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. ముందుగా సివిల్ కోర్టుల సవరణ బిల్లుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమాధానమిచ్చారు. 23 న్యాయస్థానాల భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టామని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదుల కోసం రూ.100 కోట్లు కేటాయించామన్నారు. దీని ద్వారా న్యాయవాదుల కుటుంబాలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 41 సీఆర్పీసీ పై ఎటువంటి సవరణ చేయలేమని...పోలీస్ శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

పుర చట్టం... చాలా కఠినం

పురపాలిక చట్టంపై మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా మున్సిపల్ బిల్లు తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ చట్టం చాలా కఠినంగా ఉంటుందని వెల్లడించారు. తప్పు ఎవరు చేసినా కఠినంగా శిక్షిస్తామని...జనంలో భయం, అవగాహన కల్పించేందుకే చట్టాన్ని కఠినంగా రూపొందించినట్లు చెప్పారు. మున్సిపల్‌ చట్టంలో ఐదు సవరణలు చేసినట్లు కేటీఆర్ వివరించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులేనని చెప్పారు. 75 గజాల లోపు స్థలాలు ఉన్నవారు ఎలాంటి అనుమతి లేకుండా ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చునని వెల్లడించారు.

కలెక్టర్లకు పెత్తనం... సరైంది కాదు: జీవన్​రెడ్డి

పుర పాలకులపై కలెక్టర్లకు పెత్తనం ఇవ్వడం సరైంది కాదని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జీవన్‌ రెడ్డి అన్నారు. ఫ్లెక్సీలకు విరుద్ధం అని చెబుతున్న మంత్రి ఫ్లెక్సీలే నగరంలో ఎక్కువగా ఉన్నాయని జీవన్ రెడ్డి మండలిలో తెలిపారు. యురేనియం తవ్వకాల కోసం అన్వేషణను నిషేధిస్తూ శాసనమండలిలో మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది.

ఇవీ చూడండి: శాసనసభ నిబంధనల కమిటీల ఛైర్మన్లు వీరే...

ABOUT THE AUTHOR

...view details