Compensation : ప్రాజెక్టులు, పరిశ్రమలు, నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణల కోసం సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారం దాదాపు రూ.వెయ్యి కోట్లు రాష్ట్ర భూసేకరణ, పునరావాసం-పునరాశ్రయ అధికార సంస్థ (ల్యాండ్ అక్విజిషన్, రీహాబిటేషన్- రీసెటిల్‌మెంట్ అథారిటీ) వద్ద మూలుగుతున్నాయి. 2017 నుంచి ఈ సొమ్ము పేరుకుపోతూ వస్తోంది. రూ.300 కోట్ల వరకు సొమ్మును తీసుకోవడానికి నిర్వాసితులు ముందుకు రావడం లేదు. మరో రూ.700 కోట్లకు సంబంధించి చిన్నచిన్న వివాదాలు నెలకొని.. కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా, మరికొందరు కోర్టులను ఆశ్రయించారు. ఆ సొమ్మును భూసేకరణ అధికారులు సంస్థ వద్ద డిపాజిట్ చేశారు. ఇలా పలు కారణాలతో ఏళ్ల తరబడిగా పరిహారం సొమ్ము పోగుపడుతోంది.
దాదాపు 15 వేల మంది రైతుల పరిహారం చెల్లింపులకు నోచుకోవడం లేదు. ప్రధానంగా జలాశయాలు, ఎత్తిపోతలు, కాలువల నిర్మాణాలకు భూసేకరణ చట్టం-2013 కింద ప్రభుత్వం భూములను సేకరిస్తుంది. ప్రభుత్వ ధరలకు అనుగుణంగా భూసేకరణ విభాగం(రెవెన్యూ) భూముల ధరలు నిర్ణయించి చట్ట ప్రకారం నోటిఫికేషన్ జారీ చేసి అవార్డు ప్రకటిస్తుంది. నిర్వాసితులకు పరిహారం చెక్కులు మంజూరు చేస్తారు. భూమి ఇవ్వడం ఇష్టం లేకపోవడంతోనో, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు తక్కువగా ఉంటున్నాయని.. మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచి ఇవ్వాలని కోరుతూనో నిర్వాసితులు కొన్నిచోట్ల చెక్కులు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దీంతో వారికి సంబంధించిన చెక్కులను భూసేకరణ అధికారులు అథారిటీ వద్ద డిపాజిట్ చేస్తున్నారు. భూములకు సంబంధించిన పత్రాలను నిర్వాసితులు చూపకపోయినా పరిహారం ఇవ్వడం లేదు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ.300 కోట్ల వరకు అథారిటీ వద్ద నిల్వ ఉంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీతారామ, సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు చెందిన జలాశయాలు, కాలువల కింద భూములు సేకరించారు. వీటితో పాటు రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో నిర్మిస్తున్న ఫార్మా సిటీకి సంబంధించి రూ.150 కోట్లూ నిల్వ ఉన్నాయి.
పరిహారం తిరిగి పొందడమిలా..
భూసేకరణ చట్టం కింద నిర్వాసితులకు చెక్కుల రూపంలో పరిహారం విడుదలైతే అదే ఆఖరు అవుతుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. కోర్టులు, ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో పరిహారాన్ని పెంచితే తప్ప అవార్డు ప్రకారం ఖరారైన మొత్తాన్ని బాధితులు తీసుకోవాల్సిందేనంటున్నాయి. జిల్లాల్లోని భూసేకరణ విభాగం(రెవెన్యూ) అధికారుల నుంచి చెక్కులు హైదరాబాద్‌లోని అథారిటీ వద్ద డిపాజిట్ అయితే.. వాటి కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూములకు సంబంధించిన పట్టా పాసుపుస్తకాలు, ఆధారాలు చూపితే జిల్లాల్లోనే స్పష్టత వస్తుందని.. లేదంటే హైదరాబాద్ నాంపల్లి సమీపంలోని అథారిటీలో రిజిస్ట్రార్‌ను కలిసి విచారణ చేయవచ్చని సూచిస్తున్నారు.