తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా వచ్చిన వారు రెండో డోసుకు రెండు నెలలు ఆగాలి' - తెలంగాణలో కొవిడ్​ ప్రభావం

ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న వారికి యాంటీబాడీలు నిరంతరంగా ఉండటం కోసం ఆరు నెలల తర్వాత బూస్టర్‌ డోసు ఇవ్వాలని వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. టీకా రెండు డోసులు తీసుకున్న వారిలో 30 మందికి నిమ్స్‌లో బూస్టర్‌ డోసు ఇవ్వడానికి భారత్‌ బయోటెక్‌ కంపెనీ సిద్ధమవుతోంది. ఈ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లూ చేస్తున్నట్లు నిమ్స్‌ తరఫున కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించిన ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌, నిమ్స్‌ ఫార్మకాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ చింతపర్తి ప్రభాకరరెడ్డి వెల్లడించారు. ‘ఈనాడు-ఈటీవీభారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు.

booster dose covid vaccine
నిమ్స్​లో బూస్టుర్​ డోసు పరీక్షలు

By

Published : Apr 25, 2021, 9:11 AM IST

  • టీకా తీసుకున్న తర్వాత కొవిడ్‌ వచ్చిన వ్యక్తులు రెండో డోసును నిర్ణీత సమయానికి తీసుకోవచ్చా?

మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా వచ్చిందనుకోండి. కొవిడ్‌ వచ్చిన నెల నుంచి రెండు మాసాల తర్వాతే రెండో డోసు తీసుకోవాలి. సాధారణంగా పాజిటివ్‌ వచ్చిన రెండో వారం నుంచి 80 శాతం.. ఆపైన యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. ఈ సమయంలో మరో డోసు తీసుకుంటే టీకా వల్ల మరికొన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అవడంతో శరీరం కొన్ని రకాల దుష్పరిణామాల(సైడ్‌ ఎఫెక్ట్స్‌)కు గురయ్యే ప్రమాదం ఉంది. టీకా ప్రయోగాల్లో పాల్గొన్న వ్యక్తిగా నేను ఇచ్చే సలహా అంతా పాటిస్తే మంచిది. టెస్టు చేయించుకుని ఒకవేళ యాంటీబాడీలు లేకపోతే నెల తర్వాత వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు.

  • యాంటీబాడీలు దీర్ఘకాలం ఉండటం కోసం బూస్టర్‌ డోసును కూడా అభివృద్ధి చేస్తున్నట్లు టీకాల తయారీ కంపెనీలు ప్రకటించాయి. కొవాగ్జిన్‌ తరఫున దీనిపై ప్రయోగాలు మొదలు పెట్టబోతున్నారా?

నిమ్స్‌లో మొదటి దశలో 50 మందికి కొవాగ్జిన్‌ టీకాను ఇచ్చాం. రెండో దశలో 2,160 మందికి వేశాం. ఒక్కొక్కరికీ మొదటి డోసు ఆరు మైక్రోగ్రాములు, రెండో డోసు కింద మరో ఆరు మైక్రోగ్రాములు ఇచ్చాం. వీరంతా మా నిరంతర పరిశీలనలో ఉన్నారు. వీరందరికీ యాంటీబాడీలు వృద్ధి చెందాయి.రెండో దశలోని వారి నుంచి 30 మందికి మరో ఆరు మైక్రోగ్రాముల కొవాగ్జిన్‌ మందును బూస్టర్‌ కింద ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఫలితాల ఆధారంగా అందరికీ బూస్టర్‌ అందుబాటులోకి వస్తుంది.

  • మహమ్మారి సొకితే రెండు వారాలు తప్పనిసరిగా ఐసొలేషన్‌లో ఉండాలా? నెగెటివ్‌ వచ్చిన తర్వాత బయటకు వచ్చేయవచ్చా?

కరోనా లక్షణాలు కనిపించిన దగ్గర నుంచి రెండు వారాల పాటు ప్రతి ఒక్కరూ ఐసొలేషన్‌లోనే ఉండాలి. కొంతమంది పరీక్ష చేయించుకున్న 8 రోజులకే మళ్లీ చేయించుకుని నెగెటివ్‌ వచ్చిందని బయటకు వస్తున్నారు. ఇది ప్రమాదకరం. అలాంటి వారి వల్ల ఎంతోమందికి వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఇటీవల శ్రీనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కొవిడ్‌ వచ్చింది. అనుమానంతో నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. పాజిటివ్‌ రావడంతో ఇంట్లోనే ఉన్నారు. వారం రోజుల తర్వాత లక్షణాలు ఏమీ లేవని, పూర్తిగా కోలుకున్నానని, ర్యాపిడ్‌ టెస్టు చేయించుకున్నారు. నెగెటివ్‌ వచ్చింది. తనకు కరోనా లేదని ఇంట్లో వారందరితో సన్నిహితంగా మెలిగారు. మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యులకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా అందరికీ పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించగా లక్షణాలు తగ్గకుండానే ఇంట్లోవారితో సన్నిహితంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని తేలింది. నెగెటివ్‌ వచ్చినా సంబంధిత రోగి కారణంగా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

  • మానసిక రోగులు, స్టెరాయిడ్స్‌ వాడుతున్న వారు టీకా తీసుకోవచ్చా?

కొంత మంది ఇమ్యునో సప్రెసెంట్స్‌, స్టెరాయిడ్స్‌ వాడుతుంటారు. ఇటువంటి వారు టీకా తీసుకోవాలంటే వారిని తరచూ చూసే వైద్యుడి సలహా తీసుకోవాలి. మానసిక రోగులు, ఇతర దీర్ఘకాలిక రోగాలున్న వారు వైద్యుల సూచనల మేరకు టీకాలు తీసుకోవచ్చు. ఎలాంటి అపోహలూ అవసరం లేదు.

  • టీకా వేయించుకున్న వారిలో యాంటీబాడీలు ఎన్నాళ్లు ఉంటున్నాయని మీ పరిశీలనలో తేలింది?

చాలా మందిలో 6 నెలల నుంచి 12 మాసాలపాటు ఉంటున్నాయి. అతికొద్ది మందిలో మాత్రం 6 నెలల తర్వాత తగ్గుతున్నాయి. కొంతమంది రెండో డోసుకు కూడా యాంటీబాడీలు వృద్ధి చెందలేదని మూడో డోసు అంటూ ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. రెండు డోసుల్లో వృద్ధి చెందలేదంటే వారి శరీర స్వభావం వేరుగా ఉండి ఉండొచ్చు. అలాంటి వారు మూడో డోసు వేయించుకున్నా ఫలితం ఉండదు.

  • కొంతమంది జ్వరంతో ఉన్నా కూడా టీకా వేయించుకుంటున్నారు... ఫర్వాలేదా?

జ్వరం వచ్చిన వారు తగ్గిన తర్వాతే టీకా వేయించుకోవడం మంచిది. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారిలో కొంతమందికి జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తున్నాయి. అప్పటికే ఉన్న ఈ లక్షణాలు టీకా వల్ల ఎక్కువైతే శరీరం భరించే పరిస్థితి కొందరిలో ఉండదు. టీకా తీసుకున్నవారు కనీసం రెండు రోజులపాటు మద్యం తీసుకోకూడదు.

  • కరోనా రోగులు కొందరిలో ఒక్కసారిగా ఆక్సిజన్‌ స్థాయి తగ్గి ఆసుపత్రి పాలవుతున్నారు. హోం ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు కనీసం 16 గంటలు విశ్రాంతిలోనే ఉండాలి. వైద్యుల సూచనలతో మందులు వాడాలి. ఎటువంటి పనులు పెట్టుకోవద్దు. మానసిక ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటే 90 శాతం మంది ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు.

ఇవీచూడండి:కొవాగ్జిన్ ధర ప్రకటించిన భారత్​ బయోటెక్​

ABOUT THE AUTHOR

...view details