శాసనసభ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు ఇది అనువైన సమయం కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అసెంబ్లీ కోటాలో ఖాళీ అయిన ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నిర్వహించాల్సిన ఎన్నికలను కరోనా కారణంగా ఈసీ గతంలో వాయిదా వేసింది. దీంతో జూన్ మూడో తేదీ నుంచి ఆ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గి అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికలసంఘం రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.
ఈసీ లేఖకు సమాధానమిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని పేర్కొంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 600కు పైగా నమోదు అవుతుండడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సబబు కాదని వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యుత్తరం పంపింది. దీనిపై ఈసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.