కరోనా వైరస్ విజృంభణ కారణంగా.... ఏర్పడ్డ పరిస్థితులు కుదుటపడేవరకూ ఈ ఏడాది ఆన్‌లైన్‌లోనే తరగతులు నిర్వహించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 3 నుంచి మే రెండో వారం వరకూ విద్యాసంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 180 పనిదినాలు ఉండనున్నాయి. సుమారు 30శాతం పాఠ్యాంశాల తగ్గింపునకు కసరత్తు జరుగుతోంది. తద్వారా పనిదినాలు తగ్గినా విద్యార్థులపై ఒత్తిడి ఉండదని భావిస్తున్నారు. ఈ ఏడాది పండగ సెలవులు కూడా తగ్గించనున్నారు. పరీక్షల షెడ్యూల్ సైతం మారనుంది.
మన టీవీ ద్వారానూ..
పాఠశాలలు పనిచేసే 180 రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చేదాకా... ఆన్‌లైన్, దూరదర్శన్, మన టీవీ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాతే నేరుగా తరగతులు ఉండనున్నాయి. ఇప్పటికే 6 గంటల పాటు సప్తగిరి ఛానల్ ద్వారా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా మన టీవీ ద్వారానూ పాఠాలు ప్రసారం చేయాలని భావిస్తున్నారు. మార్చిలో నిర్వహించే పదో తరగతి పరీక్షలను ఏప్రిల్‌కు మార్పు చేయడం.. మే మొదటి వారంలో 6 నుంచి 9 తరగతుల వారికి పరీక్షలు నిర్వహించేలా కేలండర్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నారు. 2021 మే రెండోవారం నుంచి జూన్ 12 వరకూ సెలవులిచ్చి తర్వాత ఎలాంటి మార్పుల్లేకుండా వచ్చే విద్యాసంవత్సరాన్ని ప్రారంభించే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.