కరోనా వైరస్ ప్రభావం ప్రధాన ఆలయాలపైనా పడింది. వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా భక్తులకు శ్రీవారి దర్శనాన్ని, ఆర్జిత సేవలను వారంపాటు తాత్కాలికంగా నిలిపివేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనానికి తిరుమల గిరులకు చేరుకొనే అలిపిరి, శ్రీవారి మెట్టు కాలినడక మార్గాలతో పాటు వాహనాలు వెళ్లే కనుమ రహదారులను తితిదే మూసివేసింది. శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ విరామసమయ దర్శన టికెట్లు ఉండి... గురువారం నాటికి తిరుమలకు చేరుకొన్న భక్తులకు మాత్రమే ఉదయం వరకూ దర్శనం కల్పించింది. మధ్యాహ్నం నుంచి పూర్తిగా భక్తుల ప్రవేశాన్ని నిలిపేస్తున్నామని ఆలయ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. కల్యాణకట్ట, వసతి గృహలు, అతిథి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, అన్న ప్రసాద కేంద్రాలను పూర్తిగా మూసివేస్తున్నామన్నారు.
కైంకర్యాలు కొనసాగుతాయి
దేవస్థానంలో లభ్యమవుతున్న రికార్డుల మేరకు 1892లో రెండు రోజులపాటు ఆలయం మూతపడిందని ఈవో తెలిపారు. మహంతులు, అర్చకుల మధ్య విభేదాలతో రెండు రోజులు మూసేశారని... ఇప్పుడు కైంకర్యాలు కొనసాగిస్తూనే భక్తుల ఆలయ ప్రవేశంపై మాత్రమే నిషేధం విధిస్తున్నామని ఈవో ప్రకటించారు.