తెలంగాణలో పూల పండుగ ఉత్సవాలు షురూ అయ్యాయి. మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు ఈ వేడుకలు జరుగుతాయి. తంగేడు, గునుగు, తామర, గడ్డి పూలు మొదలుకొని తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో విధంగా గౌరమ్మను కొలుస్తూ... ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తారు. మూడో రోజు ఆశ్వయుజ విదియ నాడు 'ముద్దపప్పు బతుకమ్మ'గా(Bathukamma day 3, 2021) పూజిస్తారు. ఇవాళ ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేస్తారు.
రోజుకో తీరుగా..
తొమ్మిది రోజులు.. తొమ్మిది రూపాల్లో ఆ అమ్మవారిని కొలుస్తారు. ఆడబిడ్డలందరూ ఈ నవరాత్రులను(Bathukamma celebrations in telangana) ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఇవాళ తామర పాత్రల్లో మూడంతరాలలో చామంతి, సీతమ్మజడ, రామబాణం, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. శిఖరంపై పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు. ఉదయం పూజలు చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం, బోగభాగ్యాలు కలుగుతాయని తెలంగాణ ప్రజల విశ్వాసం.
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..
విశాలమైన ప్రదేశంలో తొలుత వెంపలి చెట్టును నాటి... దానిపై పసుపు కుంకుమను చల్లుతారు. అనంతరం బతుకమ్మలను ఆ చెట్టు చుట్టూ ఉంచుతారు. చిన్నాపెద్ద తేడా లేకుండా ఒకరి చేయి ఒకరు పట్టుకొని కోలాటాలు చేస్తారు. మరికొందరు చేతిలో రెండు కర్రలను పట్టుకొని కోలాటం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఊయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో...., ఒక్కేసి పువ్వేసి చందమామ... ఒక్కజాములాయే చందమామ..., పసుపుల పుట్టింది గౌరమ్మా... పసుపుల పెరిగింది గౌరమ్మా... అంటూ చప్పట్లతో కష్టసుఖాలను తెలియజేసే జానపద పాటలు పాడుతారు. బంధాలు, బంధుత్వాలపైనా పాటలు పాడుతారు. పిల్లాపెద్దా కలిసి ఐక్యతా, సోదరభావం, ప్రేమానురాగాలతో జరుపుకుంటారు.