Teachers : ఈ టీచర్లు పిల్లల కోసం ఏమైనా చేస్తారు.. - online classes for telangana students
బడులు ఇంకా తెరుచుకోలేదు. ఆన్‌లైన్ చదువులకు అన్నిచోట్లా అవకాశం లేదు. దేశంలో సగం మంది పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలు చేరడం లేదని చెబుతున్నాయి సర్వేలు. కానీ పిల్లల చదువులు ఆగిపోవడం తల్లిదండ్రులకే కాదు, టీచర్లకీ ఇష్టం ఉండదు. అందుకే తమదైన శైలిలో పిల్లల చదువుల కోసం వీరు పాటుపడుతున్నారు...
ఈ టీచర్లు పిల్లల కోసం ఏమైనా చేస్తారు..
By
Published : Jul 25, 2021, 10:22 AM IST
చెట్టుమీద డిజిటల్ క్లాసులు...
సీఎస్ సతీశ... కర్ణాటకలోని కొడగు జిల్లా ముల్లూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు. గతేడాది లాక్‌డౌన్‌తో పిల్లలు చదువుల్లో వెనకబడిపోవడాన్ని గమనించారు. తర్వాత బడులు తెరుచుకున్నా, రెండో దశతో మళ్లీ మూతపడ్డాయి. ఈసారి పిల్లల చదువుల్ని ఎలాగైనా కొనసాగించాలని నిశ్చయించుకుని గూగుల్ మీట్‌ద్వారా ఆన్‌లైన్ క్లాసులు చెప్పడం మొదలుపెట్టారు సతీశ. ఫోన్లులేని పిల్లలు స్నేహితుల ఇళ్లకు వెళ్లేలా ప్రోత్సహించారు. అయితే తన ఇంట్లోకి సిగ్నల్ సరిగ్గా రాకపోవడంతో క్లాసులకు అంతరాయం కలిగేది. మిద్దెపైకి వెళ్దామంటే తనది పెంకుటిల్లు. అందుకని ఓ మామిడి చెట్టు పైకెక్కి చూస్తే సిగ్నల్ బాగా వచ్చింది. దాంతో ఆ చెట్టు కొమ్మని ఆసరాగా చేసుకుని 20 అడుగుల ఎత్తులో తానే రెండు నెలలపాటు కష్టపడి ట్రీహౌస్ నిర్మించారు. వర్షాకాలంలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు టార్పాలిన్‌తో దానిపైన కప్పు వేయించారు. అక్కణ్నుంచి కన్నడ, ఇంగ్లిష్, గణితంలో 1-5 తరగతులకు పాఠాలు చెబుతున్నారు. లోపల మొబైల్ స్టాండ్, ఫోకస్ లైట్ కూడా ఏర్పాటుచేసుకున్నారు. తన పాఠాలకు అవసరమైన గ్లోబ్, చార్టులూ, మ్యాపుల్లాంటివాటినీ ట్రీహౌస్‌లో పెట్టారు. ఇంట్లో నెట్‌వర్క్ సమస్యతోపాటు ఇతర రకాలైన చప్పుళ్లు వినిపించేవనీ ఇప్పుడా సమస్య లేదనీ చెబుతారు సతీశ.
స్టార్ట్‌ఫోన్లు... డేటాప్యాక్‌లు...
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన జోగేష్ చంద్ర ప్రభుత్వ బాలికల హైస్కూల్ టీచర్లు తమ విద్యార్థుల చదువుల కోసం పెద్ద మనసు చేసుకున్నారు. డిజిటల్ పరికరాలు లేని కారణంగా క్లాసులకు హాజరుకాలేని విద్యార్థులకు తామే చందాలు వేసుకుని రూ.1.5 లక్షలు పెట్టి స్మార్ట్‌ఫోన్లు కొనిచ్చారు. ఈ స్కూల్ విద్యార్థుల్లో 60 శాతం పేద కుటుంబాలకు చెందినవారే. వారిలో చాలామంది మొదటి తరం అక్షరాస్యులు. వీరిలో చాలామంది తల్లిదండ్రులు తోపుడు బళ్లమీద వస్తువులు అమ్మేవాళ్లూ, పనిమనుషులుగా ఉపాధి పొందేవాళ్లూ... కరోనా కారణంగా ఆదాయం తగ్గి తిండికి ఇబ్బంది పడుతున్న వీరు తమ పిల్లల చదువుల గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. ఈ ఏడాది మార్చి నుంచి డిజిటల్ క్లాసులు జరుగుతున్నా కొందరు విద్యార్థులు హాజరు కావడంలేదు. కారణాలు తెలుసుకుంటే, 55 మందికి ఎలాంటి డిజిటల్ పరికరాలూ లేవని తేలింది. కానీ అంతమందికి పరికరాలు ఒకేసారి కొనివ్వడం కష్టం. అందుకని వారిలో బాగా చదివే 21 మందికి స్మార్ట్‌ఫోన్లు కొని వాటిని వారి తల్లిదండ్రులకు అందజేశారు. దాంతోపాటు నెలకు అవసరమైన డేటా ప్యాక్‌నీ వేసిచ్చారు. ఎవరికి ఇబ్బంది ఉన్నా ముందే చెబితే ప్రతి నెలా డేటా వేయించడానికి సిద్ధమని భరోసా ఇచ్చారు. దీనికోసం నెలకు ఏడు వేలు ఖర్చవుతుందట. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైన నాటి నుంచీ ఈ స్కూల్ టీచర్లు తాముగా కొందరు విద్యార్థులకు డేటా ప్యాక్‌లు వేస్తూ, పుస్తకాలు కొనిస్తూ చేయూతనందించారు. త్వరలోనే మిగిలిన పిల్లలకూ పరికరాలు ఇస్తామంటున్నారు టీచర్లు.
ఎడారి ఓడమీద టీచర్లు...
రాజస్థాన్‌లోని బర్మేర్ జిల్లా భీమ్‌తాల్ హైస్కూల్లో 700 మంది విద్యార్థులు చదువుతున్నారు. వాళ్లలో 150 మంది థార్ ఎడారి మధ్యలోని ఎనిమిది చిన్న గ్రామాల నుంచి వస్తుంటారు. ఆ గ్రామాల్లోని పాఠశాల విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు లేవు. ఉన్నా అక్కడ ఏ ఒక్క నెట్‌వర్క్ కూడా సరిగ్గా అందదు. వాళ్లంతా కొన్ని నెలలుగా చదువులకు దూరం కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు. అందుకే టీచర్లను తమ ఊరికి రావాలంటూ వేడుకున్నారు. అయితే అందుకు టీచర్లు మొదట అంగీకరించలేదు. ఎందుకంటే ఆ ఊళ్లకి రోడ్డు సదుపాయంలేదు. అక్కడకు వెళ్లాలంటే ఎండలో ఎడారి బాటన నడిచి వెళ్లాలి. ఆ సాహసం చేయలేమన్నారు. అప్పుడే గ్రామస్థులు ఉపాధ్యాయుల్ని ఒంటెలమీద తీసుకువెళ్తామని హామీ ఇవ్వడంతో వెళ్లడానికి అంగీకరించారు. మొదటిరోజు తమతోపాటు పుస్తకాలూ, పెన్నులూ తీసుకువెళ్లి విద్యార్థులకు అందించారా టీచర్లు. దాదాపు నెల రోజులుగా 10కి.మీ. దూరంలో ఉండే భీమ్‌తాల్ నుంచి రెండు ఒంటెలమీద నలుగురు ఉపాధ్యాయులు విడతల వారీగా ఈ గ్రామాలకు వెళ్లి వస్తున్నారు. వారంలో మూడు రోజుల పాటు టీచర్లు వచ్చి గ్రామాల్లోని చెట్ల కింద పిల్లలకు పాఠాలు చెబుతారు. ఒక్కో గ్రామంలో 2-3 గంటలపాటు ఉంటున్నారు. ఇప్పుడు టీచర్లూ, తల్లిదండ్రులే కాదు, విద్యార్థులూ సంతోషంగా ఉన్నారు.