Telangana Politicians : ‘ఓటములు..విజయానికి సోపానాలు’...ఓ ఆంగ్ల నానుడి చెప్పే ధైర్య వచనాలివి. గెలుపోటములు సముద్ర కెరటాల్లా పడి లేస్తుంటాయని కొందరు రాజకీయ నాయకుల ప్రస్థానం చూస్తే అర్థమవుతుంది. ఒకసారి గురి తప్పినా, పార్టీ అండదండలతో ఉన్నతస్థాయికి ఎదిగిన నాయకులు భాజపా సహా పలు పార్టీల్లో కనిపిస్తారు. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడిగా నియమితులైన కె.లక్ష్మణ్ ఇందుకు తాజా ఉదాహరణ.
ముషీరాబాద్ సిటింగ్ ఎమ్మెల్యేగా, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయాలనుకున్న ఆయనకు టికెట్ లభించలేదు. కానీ ఆ ఎన్నికల్లో భాజపా తరఫున నలుగురు లోక్‌సభకు ఎన్నికవడంతో ఆ పార్టీకి ఊరట కలిగింది. ఈ క్రమంలోనే లక్ష్మణ్‌ను భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా నియమించింది. రెండు నెలల కిందటే ఆయనను ఉత్తర్‌ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. ఇంతలోనే.. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మకమైన పార్లమెంటరీ, ఎన్నికల బోర్డుల్లో లక్ష్మణ్‌కు చోటు కల్పించింది.
ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవీకాలం పూర్తిచేసుకున్న ఎం.వెంకయ్యనాయుడు తొలినాళ్లలో.. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచారు. మరోసారి ఆత్మకూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ ఓటమి తర్వాతే ఆయన జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ‘ఉదయగిరిలో ఓటమే నేను ఉప రాష్ట్రపతి వరకు వచ్చేందుకు దారితీసింది’ అంటూ ఇటీవల విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు వెంకయ్యనాయుడు. తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన వివిధ పార్టీలకు చెందిన ఏడుగురు అభ్యర్థులు.. కొద్ది నెలల్లోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీలుగా గెలవడం, ఇతర పదవులూ చేపట్టడం ఆసక్తికరం.
ఒకరు కేంద్ర మంత్రి.. ఇద్దరు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా..