ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం... ఎంత మొత్తం అప్పుల ద్వారా సమీకరించుకోవాలన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తున్న కేంద్రం ఎఫ్ఆర్బీఎమ్ పరిధిలోకి లోబడి.. బాండ్ల జారీద్వారా తీసుకునే అప్పుల మొత్తాన్ని తేల్చలేదు. కేంద్రం లేవనెత్తిన అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానాలిచ్చిన రాష్ట్రం.. ఎఫ్ఆర్బీఎమ్ కి లోబడి తీసుకున్న రుణాలతో పాటు బడ్జెట్ వెలుపల వివిధకార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించింది.
ఆర్థికశాఖ ఉన్నతాధికారులు రెండు దఫాలుగా దిల్లీ వెళ్లి... కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో సంప్రదింపులు జరిపారు. గడచిన రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రం.. ఆ చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తున్నందున వాటిని ఎఫ్ఆర్బీఎమ్ కిందే పరిగణిస్తామని అంటోంది. ఆ తరహా రుణాలు గత రెండు ఆర్థికసంవత్సరాల్లో రూ. 57వేల కోట్ల వరకు ఉన్నాయి. ఐతే... ఆ మొత్తాన్ని ఒకే ఏడాదికి కాకుండా నాలుగేళ్ల ఎఫ్ఆర్బీఎమ్ రుణాల్లో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించినట్లు సమాచారం. అంటే 57 వేల కోట్ల అప్పు మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఎఫ్ఆర్బీఎమ్ అప్పుల్లో భాగంగా పరిగణిస్తారు. ఆ మేరకు... రూ. 14వేల కోట్లను ఏటా బడ్జెట్లో ప్రతిపాదించిన అప్పుల్లో కోతవిధిస్తారు. అదే జరిగితే.. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రతిపాదించిన 53వేల కోట్లలో 14వేల కోట్లను తగ్గిస్తారు. మిగతా మొత్తానికి అనుమతిచ్చే అవకాశం ఉంది.