Boyaguda Fire Accident: సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్ డిపోలో చెలరేగిన మంటల్లో మృతి చెందిన 11 మంది బిహార్‌కు చెందిన వలస కూలీల కుటుంబాలు, గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. పని కోసం వలస వెళ్లిన తమవారు అగ్ని ప్రమాదంలో ఆహుతయ్యారని తెలిసి.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల్లో 8 మంది చాప్రాకు చెందినవారు కాగా.. ముగ్గురు కతిహార్ జిల్లాకు చెందిన వారిగా సమాచారం అందింది. వలస కూలీల మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Deceased:ప్రమాదం జరిగిన సమయంలో డిపోలో 15 మంది ఉండగా.. అందులో 11 మంది మృత్యువాతపడ్డారు. మృతులు దీపక్ రామ్(36), బిట్టు కుమార్(23), సికిందర్ రామ్ కుమార్(40), గోలు(28), సత్యేంద్రకుమార్(35), దినేష్ కుమార్(35), చింటు కుమార్(27), దామోదర్ మహల్దార్(37), రాజేశ్ కుమార్(25), పంకజ్ కుమార్(26), రాజేష్(22) గా పోలీసులు గుర్తించారు. వీరంతా ఉపాధి కోసం ఏడాదిన్నర క్రితం నగరానికి వలస వచ్చారు. చింటు, దామోదర్, రాజేశ్.. కతిహార్‌కు చెందిన వారు కాగా.. మిగతా మృతులు చాప్రాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
ప్రమాదం జరిగిన తర్వాత.. కుటుంబీకులకు మరణ వార్త చేరడంతో వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికు గురయ్యారు. ఇక మాకు దిక్కెవరు అంటూ వాపోయారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
"బోయగూడ అగ్ని ప్రమాదంలో దీపక్ చనిపోయాడని ఉదయం ఫోన్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా ఏం వింటున్నానో నాకర్థం కాలేదు. 25 రోజుల క్రితమే నన్ను, పిల్లలను చూడటానికి ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. నా భర్త చనిపోవడంతో నేను, నా పిల్లలు అనాథలయ్యాం." దీపక్ రామ్ భార్య ఉమ్రావతి దేవి