Food Processing Special Zone News: రాష్ట్రంలో రైతుల ఆదాయం రెట్టింపు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం, ఉపాధి కల్పన లక్ష్యాలుగా ప్రభుత్వం చేపట్టిన ఆహారశుద్ధి ప్రత్యేక మండలి (ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ జోన్)ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో వీటి ఏర్పాటును ప్రకటించగా ఇప్పటివరకు ఒక్కటీ ప్రారంభం కాలేదు. ఎనిమిది జిల్లాల్లోనే భూసేకరణ జరిగింది. మిగిలిన చోట్ల ఆ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం వంటి వాటి ఊసే లేదు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి నుంచి వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. ఈ తరుణంలో ఆహారశుద్ధి జోన్ల ద్వారా లబ్ధి పొందే వీలున్నా... వాటి ఏర్పాటు జరగకపోవడంతో అన్నదాతకు అదనపు ప్రయోజనం కలగడం లేదు.
అమలుకు నోచుకోని సీఎం ఆలోచనలు..
దేశంలో 2005 నుంచి ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్‌లు) ఏర్పాటయ్యాయి. తెలంగాణలోనూ 76 అనుమతులు పొందగా 35 నడుస్తున్నాయి. వాటి తరహాలోనే ఆహారశుద్ధికి ప్రత్యేక సెజ్‌లను ప్రారంభించాలని సీఎం భావించారు. దీని కోసం వెంటనే భూసేకరణ చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అన్ని మండలాల్లో ఆహారశుద్ధి కోసం ప్రత్యేక గోదాములు, శీతల గిడ్డంగులను నిర్మించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రణాళిక రూపొందించారు. ఒక్కో సెజ్‌లో కనిష్ఠంగా 225 ఎకరాలు.. గరిష్ఠంగా 500 ఎకరాల మేర ఉండాలని నిర్ణయించారు. వీటిల్లో నీరు, విద్యుత్తు సరఫరా, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు..ప్రాసెసింగ్, స్టోరేజీ యూనిట్లు, మార్కెటింగ్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ సెజ్‌లలో వరితో పాటు పత్తి, మిర్చి, పసుపు, పప్పులు, వంటనూనెలు, పళ్లు, కూరగాయలు, మాంసం, పాలు, చేపల శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తారు. ఈ సెజ్‌లు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాలుగా కూడా పనిచేస్తాయి. వీటి ద్వారా 2024 నాటికి రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 70 వేల మందికి ఉపాధి కల్పించాలని సర్కారు నిర్దేశించింది. దీనిలో భాగంగా 32 జిల్లాల్లోని ఆహారశుద్ధి జోన్లలో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించగా 602 వచ్చాయి.