కోడి మాంసం, గుడ్డు పూర్తిగా సురక్షితమని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ గుడ్డు కమిషన్ ఛైర్మన్ చిట్టూరి సురేష్‌రాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ ఆనవాళ్లు లేవని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు. మన దేశంలో బర్డ్ ఫ్లూ కొత్తేం కాదని, రైతులు కోళ్ల ఫామ్‌లను సురక్షితంగా ఉంచుకుంటే వైరస్ సోకదని వివరించారు.
అక్కడి నుంచే వస్తుంది
సాధారణంగా చైనా, కజికిస్థాన్ వంటి దేశాల నుంచి వలస పక్షులు వచ్చిన ప్రతిసారి దేశంలో బర్డ్‌ఫ్లూ వస్తుంటుందన్నారు. చైనా, వియత్నాం వంటి దేశాల్లో కోళ్లతోపాటు పందులు, ఇతర జంతువులను కూడా పెంచుతున్న దృష్ట్యా.. ఆయా దేశాల్లో సులభంగా వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉంటాయని తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే గుడ్డు, చికెన్ నిరభ్యంతరంగా తినవచ్చని ఈనాడు-ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
దేశంలో బర్డ్‌ఫ్లూ ప్రభావం ఎలా ఉంది?
కేరళ, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో కోళ్లలో బర్డ్‌ఫ్లూ నిర్ధరణైంది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు సమాచారం రాలేదు. భోపాల్‌లోని జాతీయ పశువ్యాధుల సంస్థ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) నుంచి అధికారికంగా సమాచారం వస్తే తప్ప ఏం చెప్పలేని పరిస్థితి. ఈ వ్యాధి నిర్ధారణకు దేశవ్యాప్తంగా ఇదొక్కటే ప్రయోగశాల ఉంది. ఇలాంటి వైరస్ తీవ్రత సమయాల్లో పరీక్షలు త్వరగా చేయాలి. ఆ వైరస్ ఏ ఫామ్‌లో వచ్చిందో తెలుసుకుని ఆ కోళ్లన్నింటినీ చంపేసి జాగ్రత్తగా పూడ్చేస్తే మరింత ప్రబలకుండా ఉంటుంది. వాస్తవానికి కోళ్ల నుంచి వైరస్ మనుషులకు సోకదు. ఇది శాస్త్రీయంగా రుజువైంది.