తెలంగాణ

telangana

ETV Bharat / city

TS -AP water war: 'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది' - water disputes between ap and Telangana

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ప్రజల దృష్టి మరల్చి.. వాటిని కొనసాగించుకోవడానికే ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్త కొత్త వాదనలు తెరపైకి తెస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. అక్రమ ప్రాజెక్టులను కేఆర్​బీఎం పరిధిలోకి ఎలా తెస్తారని.. కేంద్ర బలగాలతో పనేంటో చెప్పాలన్నారు. జగన్ లేఖపై కేంద్ర ప్రభుత్వం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని.. ప్రధాని ధర్మం, న్యాయం వైపు నిలబడాలని కోరారు. హైదరాబాద్​లోని వారంతా తమ బిడ్డలేనని తాము అంటుంటే.. సెటిలర్లు అనే పేరుతో విడదీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

minister srinivas goud
minister srinivas goud

By

Published : Jul 2, 2021, 3:11 PM IST

Updated : Jul 2, 2021, 4:55 PM IST

'అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ వాటాను ఏపీ దోచుకుంటోంది'

ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖపై తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. అక్రమ ప్రాజెక్టులను కప్పిపుచ్చుకొని.. ప్రజల దృష్టి మరల్చి వాటిని కొనసాగించేందుకే.. కేంద్ర బలగాలు, హైదరాబాద్​లో సెటిలర్లు, కేంద్రం జోక్యం చేసుకోవాలి అంటూ కొత్త కొత్త వాదనలను తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టులో కేసులు వెనక్కి తీసుకొని అపెక్స్ కౌన్సిల్ ద్వారా నిర్ణయించుకుందామని.. అప్పటి వరకు ప్రాజెక్టులు నిర్మించబోమని చెప్పింది జగన్ కాదా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కేటాయింపుల్లో వివక్ష జరిగిందని... కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని.. నీటి కేటాయింపులు పూర్తి కాకముందే.. ప్రాజెక్టులు ఎలా కడతారన్నారు.

అవి ఉత్తుత్తి జీవోలా?

ఏపీ నిర్మిస్తున్నవి ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టులేనని.. వాటిని వెంటనే ఆపాలని శ్రీనివాస్​ గౌడ్​ డిమాండ్ చేశారు. తెలంగాణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహా ఉమ్మడి సీఎంలు జారీ చేసిన జీవోల ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణవి అక్రమ ప్రాజెక్టులైతే.. అప్పటి సీఎంలు ఇచ్చిన జీవోలు ఉత్తుత్తివా లేక తెలంగాణను మోసం చేయడానికి ఇచ్చినవా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులన్నీ నిబంధనల ప్రకారమే ఉన్నాయని.. వాటికి ఏపీ వక్రభాష్యం చెబుతోందని ఆరోపించారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు

ప్రాజెక్టులపై కేంద్ర స్థాయిలో పరిష్కరించుకుందామని జగన్ పేర్కొనడం అనుమానాలు కలిగిస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రంతో ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా.. కేంద్రం చేతిలోనే మొత్తం అధికారం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. ఉద్యమం సమయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న నేటి కేంద్ర మంత్రులు... ఇప్పుడు రాష్ట్రానికి ఒక్క జాతీయ ప్రాజెక్టయినా ఎందుకు ఇవ్వడం లేదన్నారు. జగన్ లేఖపై కేంద్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ధర్మం, న్యాయం వైపు నిలబడాలని.. ట్రైబ్యునల్, జలవనరుల శాఖ మంత్రి వద్ద సమాచారం తెప్పించుకోవాలని కోరారు.

అవసరమైతే నిధులు ఇస్తాం

'ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితండ, అసంబద్ధ వాదనలు చేస్తోంది. హైదరాబాద్​లో ఉన్న వారంతా మా బిడ్డలేనని చెబుతుంటే.. ఏపీ నేతలు సెటిలర్లు అంటూ విడగొట్టి, వైషమ్యాలు పెంచేలా మాట్లాడుతున్నారు. సెటిలర్లు అనే పదాన్ని ఉద్యమ కాలంలోనే వాడలేదు. హైదరాబాద్​లో ఉంటున్న ఏపీ వారు.. కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నారు. ఉద్యమం సమయంలోనూ తెలంగాణకు ఎంత అన్యాయం జరిగినా.. ఆత్మాహుతులకు పాల్పడ్డారు కానీ.. ఏపీ వారిని ఏమీ అనలేదు. తెలంగాణలోని ఏపీ వారికి ఎన్నడూ అభద్రత భావం లేదు. కానీ ఏపీ నేతల పద్ధతులు చూస్తే... అలాంటి పరిస్థితులు కల్పిస్తారేమోనన్న అనుమానం కలుగుతోంది. రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు అన్నదమ్ముల్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఆపాలి. నీటి కేటాయింపులు జరిగాక.. అవసరమైతే నిధులు, ఇంజినీరింగ్ సహకారం కూడా చేస్తాం.'

-వి.శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర క్రీడలు, ఆబ్కారీ శాఖ మంత్రి

ఇదీచూడండి:TS-AP WATER WAR: ప్రాజెక్ట్‌ల వద్ద కొనసాగుతున్న పోలీసుల పహారా

Last Updated : Jul 2, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details