తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో శాసన మండలికి స్వస్తి!

శాసనమండలి రద్దు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మండలి అవసరమా అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో గురువారం చేసిన వ్యాఖ్యలు.. రద్దుకు సంకేతాలని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశంపై సోమవారం శాసనసభలో తీర్మానం పెట్టి రద్దు నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి.

ap council
రాష్ట్ర శాసన మండలికి స్వస్తి!

By

Published : Jan 24, 2020, 7:18 AM IST

ఏపీలో మూడు రాజధానులకు సంబంధించిన బిల్లులను శాసనమండలి సెలక్టు కమిటీకి పంపిన నేపథ్యంలో అసలు మండలి అవసరమా అనే చర్చ అధికార పక్షంలో మొదలైంది. గురువారమే మండలి రద్దుపై అసెంబ్లీలో తీర్మానం పెడతారంటూ శాసనసభ లాబీల్లో వైకాపా నేతల మధ్య చర్చలు జరిగాయి. ఏపీ ముఖ్యమంత్రితో వైకాపా ముఖ్య నేతలు, కొందరు మంత్రులు భేటీ అవటంతో ఈ చర్చలు జోరందుకున్నాయి. గురువారమే మండలిని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేద్దామనే చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే వెంటనే చేస్తే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పద్ధతి ప్రకారమే రద్దు తీర్మానం చేద్దామని సీఎంతో కొందరు మంత్రులు చెప్పారని తెలుస్తోంది.

రద్దు ప్రక్రియపై చర్చ..

గురువారం ఉదయం వైకాపా ముఖ్య నేతలు, కొందరు సీనియర్‌ మంత్రులతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సమావేశమయ్యారు. ఇందులో శాసన మండలి రద్దు విషయంపై చర్చించారని తెలిసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్‌... మండలిని రద్దు చేసినప్పుడు ప్రక్రియ ఎలా జరిగింది..? ప్రతిపాదన నుంచి రద్దు వరకు చోటుచేసుకున్న అంశాలను సీనియర్లు వివరించారని సమాచారం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మండలిని రద్దు చేసిన పరిస్థితులపైనా చర్చించారని తెలిసింది. మండలి సభ్యులుగా అవకాశం కల్పిస్తామని పలువురు నేతలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమవుతుందని కొందరు నేతలు గుర్తు చేయగా వారికి ప్రత్యామ్నాయ పదవులు ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమైందని సమాచారం.

మండలిలో ఆధిపత్యం ఎన్నటికి..?

ప్రభుత్వానికి సంఖ్యాపరంగా శాసన మండలిలో పూర్తి ఆధిపత్యం ఎప్పటికి వచ్చే అవకాశం ఉందనే దానిపైనా చర్చ జరిగింది. 2021 జూన్‌ నాటికి సుమారు 27 మంది ఎమ్మెల్సీలు పదవీ విరమణ చేయనున్నారని తేల్చారు. వీటిలో ఎమ్మెల్యేల కోటాలో 8, స్థానిక సంస్థల కోటాలో 11, గవర్నరు నామినేట్‌ చేసే 6 పదవులు వైకాపాకే దక్కే అవకాశం ఉందని అంచనా వేశారు. అప్పటి వరకు మండలిలో ఆటంకాలు తప్పవు కదా అని ఒకరిద్దరు ముఖ్య నేతలు అభిప్రాయపడగా.. మండలిని రద్దు చేయడమే సరైందని ఎక్కువ మంది అన్నట్లు తెలిసింది. మరోవైపు వైకాపాకు చెందిన 9 మంది ఎమ్మెల్సీలు జగన్‌ను కలిసి మండలి రద్దు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పినట్లు సమాచారం.

3 రోజులే ఎందుకు..?

మండలిని రద్దు చేద్దామనే నిర్ణయానికి వచ్చినప్పుడు సోమవారం వరకు ప్రభుత్వం ఎందుకు ఆగుతోంది..? వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకుందా? ఈ 3 రోజుల్లో ఏం జరగనుందనే అంశాలపై ప్రభుత్వం, వైకాపా వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మండలి రద్దుపై న్యాయ నిపుణులతో లోతుగా చర్చలు జరపడానికి, రాజకీయ పక్షాలు, ప్రజల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో పరిశీలించడానికి 3 రోజుల సమయం తీసుకున్నట్లు కొందరు చెబుతున్నారు. శనివారం లేదంటే సోమవారం మంత్రిమండలి సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిసింది. మండలి రద్దుపై అవసరమైతే మంత్రిమండలిలో నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇవీచూడండి: ఈ మండలి మనకు అవసరమా..?: ఏపీ సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details