POLAVARAM: ఏపీలో పోలవరం నిర్మాణంలో భాగంగా నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం 2 దశల్లో చేపట్టనున్నట్లు కేంద్ర జల్‌శక్తిశాఖ తొలిసారి వెల్లడించింది. ప్రాజెక్టులో +41.15 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ చేస్తే ఎందరిని తరలించాలో వారిని తొలి దశలో, ఆపై ఎత్తున నీటిని నిలబెడితే నిర్వాసితులయ్యే కుటుంబాలను రెండో దశలో తరలించే ప్రణాళిక ఉన్నట్లు పేర్కొంది. ఏటా కేంద్ర జల్‌శక్తిశాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తుంది. 2020-21 నివేదికలో పునరావాసం ఇలా 2 దశలుగా పేర్కొనలేదు. తాజాగా వెలువరించిన 2021-22 వార్షిక నివేదికలోనే పునరావాసాన్ని 2 దశలుగా ప్రస్తావించడం గమనార్హం. పోలవరం తొలి, రెండో దశలకు ఏ స్థాయి నిధులు అవసరమవుతాయి? ఎంతమేర ప్రయోజనం? అనే అంశాలపై ఇప్పటికే కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి సమావేశం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. వీటి అంచనాలను రూపొందించే పనుల్లో అధికారులున్నారు. ఇప్పుడు కేంద్రం అధికారికంగా పోలవరం పునరావాసాన్ని 2 దశల్లో పేర్కొనడంతో పూర్తిస్థాయిలో నీటి నిల్వకు ఎన్నాళ్లు పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వ, అటవీ భూమిని మినహాయిస్తే ఈ ప్రాజెక్టు కోసం ఇతరత్రా భూమి 1,55,464.88 ఎకరాలు అవసరమని 141వ సలహా కమిటీ సమావేశం పేర్కొంది. 2021 నవంబరు వరకు 1,12,767.98 ఎకరాలు సేకరించినట్లు ఈ కమిటీ తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణానికి 2021 ఏప్రిల్1 నుంచి 2022 జనవరి12 వరకు పీఎంకేఎస్‌వై, ఏఐబీపీ కింద కేంద్రం రూ.751.80 కోట్లు ఇచ్చినట్లు జల్‌శక్తి శాఖ తెలిపింది. 2021 డిసెంబరు వరకు పోలవరంపై రూ.17,319.52 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక రూ.11,600.16 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. 141 సలహా కమిటీ సమావేశం ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు(2017-18 ధరల స్థాయి) ఆమోదముద్ర వేయగా.. 2019 ఏప్రిల్ 2న ఏర్పాటైన రివైజ్డ్ కాస్ట్ కమిటీ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.47,725.74 కోట్లుగా ఖరారుచేస్తూ 2020 మార్చి 17న నివేదించినట్లు వార్షిక నివేదిక పేర్కొంది.