రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని ప్రభుత్వ భూములపై నిర్దిష్ట గడువులోగా జియో మ్యాపింగ్ పద్ధతిలో సర్వే నిర్వహించి రికార్డు రూపొందించాలని జిల్లా కలెక్టర్లకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం సర్వే ప్రారంభించి పూర్తయ్యేదాకా వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని చెప్పింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రజ్ఞాన్‌పూర్‌లో సర్వే నం.356లోని ప్రభుత్వ భూమిని ఎం.విజయ్‌కుమార్, సీహెచ్ లక్ష్మీనీహారికలు ఆక్రమించుకున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సీహెచ్ రాజు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
గత జనవరిలో ఆక్రమణల తొలగింపుపై చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని ఆదేశించినా ఇప్పటివరకు దాఖలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఏదైనా ఫిర్యాదు అందితే వెంటనే సర్కారు చర్యలు తీసుకుంటోందని అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే గుర్తించిన భూములపై సెక్షన్ 21ఎ కింద రిజిస్ట్రేషన్‌ను నిషేధిస్తూ సబ్‌రిజిస్ట్రార్‌లకు సమాచారం ఇచ్చామన్నారు.