ఆంధ్రప్రదేశ్ తెదేపా రాష్ట్ర కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు హత్యాప్రయత్నం చేయడంతో ..బెజవాడ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న తూర్పు నియోజకవర్గంలో మళ్లీ రౌడీయిజానికి ఆజ్యం పోసేలా వైకాపా వ్యవహరించిన తీరు స్థానికులను సైతం కలవరపరుస్తోంది. గాంధీ కుడికన్ను పూర్తిగా దెబ్బతినడంతో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను హైదరాబాద్‌కు తరలించారు. గాంధీపై దాడిని తెలుగుదేశం నేతలు ఖండించారు.
తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై వైకాపా నేతలు మూకుమ్మడిగా దాడి చేసి హత్య చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. విజయవాడలో కార్పొరేటర్‌గా గాంధీ 4 సార్లు విజయం సాధించారు. ప్రస్తుతం విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో 9డివిజనుకు ఆయన భార్య కాంతిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నిన్న సాయంత్రం 9వ డివిజన్‌లో పైపులైను లీకేజీపై ఫిర్యాదులు అందింది. దీంతోదగ్గరుండి కార్పొరేషన్ సిబ్బందితో ఆయన పనులు చేయిస్తుండగా.. కొంతమంది వైకాపా నేతలు అక్కడికి చేరుకున్నారు.
తమ ప్రభుత్వం హయాంలో నీ పెత్తనమేంటంటూ వాగ్వాదానికి దిగారు. ఆ డివిజన్‌కే చెందిన వైకాపా అధ్యక్షుడు గద్దె కళ్యాణ్, వైకాపా ఇంఛార్జ్ వల్లూరి ఈశ్వరప్రసాద్, కార్యకర్త సుబ్బుతో పాటు మరో నలుగురు ఒక్కసారిగా గాంధీపై దాడి చేశారు. ముష్టి ఘాతాలు కురిపించారు. ఇనుప చువ్వతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో అతని కుడికన్ను దెబ్బతింది. స్థానికులు అడ్డుపడటంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు.
చెన్నుపాటి గాంధీని ద్విచక్రవాహనంపై తాడిగడపలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించారు. ఆయన్ను తెదేపా నేతలు పరామర్శించారు. వైకాపా దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రణాళికా ప్రకారమే ఆయనపై దాడి చేసినట్లు తెలుగుదేశం ఆరోపిస్తోంది. పటమటలంక తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవిత ఉత్సవాలను ఏటా ఘనంగా నిర్వహిస్తారు. గతంలో అంతా కలిసి వేడుకలు చేసుకునేవారు.
ఈ మధ్య పార్టీలు మారడంతో రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ క్రమంలో చవితి వేడుకలు తెదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీన్ని మనసులో పెట్టుకుని మద్యం మత్తులో కావాలని గొడవ పడ్డారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. డివిజన్‌లో చురుగ్గా వ్యవహరిస్తుండడంతో రాజకీయ కక్షతో దాడి చేశారనే మండిపడుతున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి గాంధీ అంచెలంచెలుగా ఎదిగారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా, అర్బన్ పార్టీ ఉపాధ్యక్షుడిగా .. నాలుగు సార్లు తెదేపా కార్పొరేటర్‌గా గెలిచారు. ప్రస్తుతం తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. దీంతో రాజకీయంగా గాంధీని ఎదుర్కొలేక హత్యాయత్నానికి కుట్ర పన్నారనే మాట వినిపిస్తోంది. గత ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి తెదేపా ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ గెలుపొందారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లోనూ తూర్పు నియోజకవర్గం నుంచే ఎక్కువ మంది గెలిచారు.