తెలంగాణ

telangana

ETV Bharat / city

SUPREME COURT: 'ఆ కేసులో మెరిట్‌ లేదు.. డిస్మిస్‌ చేస్తున్నాం' - తెలంగాణ వార్తలు

ఏపీ రాజధాని ఎక్కడొస్తుందో ప్రజా బాహుళ్యంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో భూముల లావాదేవీలు జరిగినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులోని పూర్వాపరాలను ఆ రాష్ట్ర హైకోర్టు కూలంకషంగా పరిశీలించాకే తీర్పు చెప్పిందని పేర్కొంది. అందులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనడానికి ఏమీ లేదంది.

SUPREME COURT insider trading, SUPREME COURT on ap government
ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సుప్రీం కోర్టు తీర్పు

By

Published : Jul 21, 2021, 9:14 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడొస్తుందో ప్రజా బాహుళ్యంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో భూముల లావాదేవీలు జరిగినట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అది కూడా లావాదేవీలన్నీ ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగినప్పుడు అందులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అనడానికి ఏమీ లేదంది. ఈ కేసులోని పూర్వాపరాలను ఏపీ హైకోర్టు కూలంకషంగా పరిశీలించాకే తీర్పు చెప్పిందని... ఆ తీర్పులో ఎక్కడా తప్పులు లేవని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. అందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వు మంగళవారం విడుదలైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి...

‘ఈ కేసులో ప్రతివాదులైన కొనుగోలుదారులు కొందరి నుంచి భూములు కొన్నారు. వారెవ్వరూ ప్రస్తుత కేసులో కక్షిదారులు కారు. సేల్‌ డీడ్‌ 2014-15లో జరిగితే ఎఫ్‌ఐఆర్‌ 2020 అక్టోబరు 1న నమోదు చేశారు. అదికూడా ఈ కేసులో మూడో ప్రతివాది అయిన వ్యక్తి 2020 సెప్టెంబరు 7న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా..! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఫలానా చోట వస్తుందని తెలిసీ కొన్నవారు ఆ విషయం దాచిపెట్టి భూములు కొనడం ద్వారా అమ్మిన వారిని మోసం చేశారన్నదే అందులో ప్రధాన ఆరోపణ. 2021 జనవరి 19న ఇచ్చిన తీర్పులో ఏపీ హైకోర్టు ఫిర్యాదుదారు లోకస్‌స్టాండీని పరిగణనలోకి తీసుకొంది. అతను కొనుగోలుదారు, అమ్మకందారు కాకపోయినా పోలీసులకు ఫిర్యాదుచేశారు. అది కూడా ఆరేళ్ల తర్వాత! ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ విషయాన్ని కూడా రాష్ట్ర హైకోర్టు పరిశీలించి, అది సెబీ యాక్ట్‌ 1992 కింద జరిగిన లావాదేవీలకే వర్తిస్తుందని తేల్చింది.

ఆస్తి సముపార్జనను రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఏపీ హైకోర్టు గుర్తించింది. తర్వాత ఈ కేసులోని వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని ఐపీసీ సెక్షన్‌ 420, 415లు ఇక్కడ వర్తించబోవని చెప్పింది. ఇక్కడేమీ కొనుగోలుదారులు మీ భూములు అమ్మాలని అమ్మకందారులను ఆశ్రయించలేదు. తమ అవసరాల కోసం భూములను అమ్ముతామని అమ్మకందారులే చెప్పి విక్రయించారు. అందువల్ల నిజాలను దాచిపెట్టి కొనుగోలుదారులు అమ్మకందారులను మభ్యపెట్టారనడానికి ఏమీ లేదు. రాజధాని ప్రాంత వివరాలన్నింటినీ ఆ రాష్ట్ర హైకోర్టు పరిశీలించింది. భూముల లావాదేవీలు జరగడానికి ముందే రాజధాని అంశం ప్రజా బాహుళ్యంలో ఉన్నట్లు పేర్కొంది. అందువల్ల విశ్వాసఘాతుకం ఎక్కడా లేదు. కాబట్టి ఐపీసీ సెక్షన్‌ 40, 409లు వర్తించబోవని ఏపీ ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక్కడ నేరపూరిత కుట్ర లేదు కాబట్టి ఐపీసీ సెక్షన్‌ 120బి కూడా వర్తించదని పేర్కొంది.

మేం కూడా ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విన్నాం. ఈ కేసులో ఐపీసీ సెక్షన్‌ 418 వర్తిస్తుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. కానీ ఆ సెక్షన్‌ ఇక్కడ వర్తించదనేది మా అభిప్రాయం. వీరు ఆ అంశం గురించి ఏపీ హైకోర్టు ముందు వాదించలేదు. ఆ వివరాలన్నీ స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లోనూ ప్రస్తావించలేదు. అందువల్ల ఇక్కడ ఈ ప్రస్తావనను తిరస్కరిస్తున్నాం. కొనుగోలుదారులు, అమ్మకందారులకు నష్టం చేకూర్చారనడానికి, మోసం చేశారనడానికి ఆధారాలూ లేవు. రాజధాని అంశం అంతకుముందే ప్రజా బాహుళ్యంలో ఉంది. ఆ విషయాన్ని ముందుగా చెప్పాలన్న ఒప్పందం కూడా కొనుగోలు, విక్రయదారుల మధ్య లేదు.

ఈ కేసులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి నిరోధక చట్టం కింద విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరుతున్నారు. అయితే ఇందులో జరిగిన భూ లావాదేవీలన్నీ ప్రైవేటు వ్యక్తులవే. రాజధాని ఎక్కడన్నది ప్రజలకు ముందే తెలుసని ఆ రాష్ట్ర హైకోర్టు కూడా చెప్పినందున ఈ అంశంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో పేర్కొన్న సాక్ష్యాధారాలు నిజమైనవా... కావా? అని తెలుసుకోవడానికి విచారణకు ఆదేశించాల్సినంత కేసేమీ కాదిది. అందుకే ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ఏమైనా మోసాలు ఉన్నాయా... లేదా? అన్న అంశాన్ని ఏపీ హైకోర్టు పరిశీలించింది. దాని తర్వాత ఐపీసీ సెక్షన్‌ 420, 406, 409, 120బి కింద పేర్కొన్న నేరాల పరిధిలోకి ఇది రాదని తేల్చింది. అందువల్ల ఏపీ ప్రభుత్వం వేసిన కేసులో మెరిట్‌ లేదు. అందుకే డిస్మిస్‌ చేస్తున్నాం’ అని జస్టిస్‌ వినీత్‌ శరణ్‌, జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

ఇదీ చదవండి:'రాష్ట్రాల అంశాల్లో కేంద్ర ఏకపక్ష చట్టాలు చెల్లవు'

ABOUT THE AUTHOR

...view details