తెలంగాణ

telangana

ETV Bharat / city

మోదీ రాకతో జోష్​లో కమలదళం.. 2023 ఎన్నికలే లక్ష్యం - BJP Vijaya Sankalpa Sabha

BJP Vijaya Sankalpa Sabha: హైదరాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశాలు, అనంతరం మోదీ విజయ సంకల్ప సభ విజయవంతంతో పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పనిచేయాలని అగ్రనేతలు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వానికి అగ్రనేతల ప్రశంసలు కురిపించారు.

BJP
BJP

By

Published : Jul 4, 2022, 8:06 AM IST

BJP Vijaya Sankalpa Sabha: హైదరాబాద్ వేదికగా రెండ్రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్టహాసంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా తనకున్న బలాన్ని, బలగాన్ని మోహరించిన కమలదళం రాష్ట్ర నేతల్లో జోష్‌ నింపింది. పార్టీ విస్తరణకు బలమైన పునాది వేయగలిగింది. పద్దెనిమిదేళ్ల తర్వాత భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కాగా ప్రధానమంత్రి మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కేంద్ర మంత్రులు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పార్టీ ముఖ్యనేతలంతా భాగస్వాములయ్యారు.

శనివారం భాజపా పదాధికారుల సమావేశంతో ఆరంభమైన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం రాజకీయ తీర్మానం, తెలంగాణపై ప్రకటనతో ముగిశాయి. విజయసంకల్ప సభకు భారీగా జనం రావడంతో అగ్రనేతలు సంతృప్తి చెందారు. కొద్దిగా వర్షం కురిసినప్పటికీ ప్రధాన వక్తల ప్రసంగం పూర్తయ్యేంతవరకు కార్యకర్తలు సభా ప్రాంగణంలోనే ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని రెండ్రోజుల కార్యక్రమాలు, సభ పెంచాయని కమలనాథులు చెబుతున్నారు.

కమలం..కారు... నువ్వా..నేనా...2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం లక్ష్యంగా పనిచేయాలని అగ్రనేతలు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేశారు. జాతీయ నాయకత్వం తీసుకునే ప్రతి చర్య వెనుక దీర్ఘకాల వ్యూహం ఉంటోంది. ఇటీవలి కాలంలో మోదీ, అమిత్‌షా, నడ్డా రాష్ట్ర పార్టీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. వీలైనప్పుడల్లా రాష్ట్ర పర్యటనలకు వస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మోదీ స్వయంగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లను పిలిపించుకున్నారు. ఈ సమావేశాల నిర్వహణ, సభ విజయవంతం కావడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యం నెరవేరిందని కమలనాథులు చెబుతున్నారు. సాధారణంగా ఒక పార్టీ సమావేశాలప్పుడు ఇతర పార్టీలు గమనిస్తుంటాయి. కానీ భాజపా సమావేశాల సందర్భంగా తెరాస విభిన్నంగా స్పందించిందని... నువ్వా? నేనా? అన్నట్లుగా వ్యవహరించిందని విశ్లేషకులంటున్నారు.

శ్రమించిన త్రిమూర్తులు..సమావేశాల నిర్వహణకు రాష్ట్ర ముఖ్యనేతలంతా ప్రత్యేక దృష్టి సారించారు. 34 కమిటీలు వేసుకున్నారు. దాదాపు నెల రోజుల పాటు శ్రమించారు. ఏర్పాట్లలో బండి సంజయ్‌, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారు. మోదీ సభ జనసమీకరణ సహా, ఈ సమావేశాల్లో సంజయ్‌ బాగా కష్టపడ్డారని.. జాతీయ సంస్థాగత వ్యవహారాల ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, ఇతర నేతలకు లక్ష్మణ్‌ చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ.. వసతి, ఇతర ఏర్పాట్ల బాధ్యతలను కిషన్‌రెడ్డి భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌తో పాటు సీనియర్‌నేతలు మురళీధర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, గరికపాటి మోహన్‌రావు, వివేక్‌ వెంకటస్వామి, గంగిడి మనోహర్‌రెడ్డి, బంగారు శ్రుతి, ప్రదీప్‌కుమార్‌, ప్రేమేందర్‌రెడ్డి బాగా శ్రమించారు. అయితే ప్రణాళికాలోపంతో తొలిరోజు కొంత గందరగోళం నెలకొంది. సమావేశాలకు వచ్చిన నాయకుల్లో కొందరు రవాణా ఏర్పాట్లు, పాస్‌ల విషయంలో ఏర్పాట్లు సరిగా లేక ఇబ్బంది పడ్డారు.

ABOUT THE AUTHOR

...view details