Modi Hyderabad Tour: జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగనున్నాయి. ఆ సమావేశాలకుప్రధాని మోదీ హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా రాష్ట్ర పోలీసుశాఖ భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానితోపాటు 40 మంది కేంద్ర ప్రముఖులు, వివిధ రాష్ట్రాల సీఎంలు, వందల మంది పార్టీ నాయకులు రెండు రోజులపాటు నగరంలో బసచేయనుండటంతో వారి భద్రతను అధికారులు సవాలుగా తీసుకుంటున్నారు. ఎక్కడా ఏ చిన్న పొరపాటుకూ తావులేకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ పోలీసు శాఖ నిమగ్నమైంది.
ప్రధాని, ఇతర ప్రముఖుల భద్రత చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అధికారులు ఇప్పటికే నగరంలో బసచేయగా పోలీసు అధికారులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. వచ్చే నెల 2, 3 తేదీల్లో హెచ్‌ఐసీసీలో జరిగే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు ఇతర కేంద్ర మంత్రులు, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల పార్టీ ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమాన్ని భద్రతపరంగా అత్యంత సున్నితమైందిగా చెప్పవచ్చు.
వీరంతా నగరంలో కాలు పెట్టినప్పటి నుంచీ తిరిగి వెళ్లే వరకూ పోలీసుశాఖకు కంటిమీద కునుకు ఉండదు. ఏ చిన్న పొరపాటు దొర్లినా అది పెను వివాదానికి దారితీస్తుంది. అందుకే ప్రతి అంశాన్నీ కూలంకషంగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాని బస కోసం హైటెక్‌సిటీ ప్రాంతంలోని రెండు ప్రముఖ హోటళ్లతోపాటు రాజ్‌భవన్‌నూ పరిశీలిస్తున్నారు. వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసినా చివరి నిముషం వరకూ దీన్ని బయటకు వెల్లడించే అవకాశం లేదు. సుమారు పదివేల మంది సమావేశ భద్రత ఏర్పాట్లలో పాల్గొనబోతున్నారన్న సమాచారమున్నా ఆ విషయంలోనూ గోప్యతను పాటిస్తున్నారు.
ఎస్పీజీ బృందం రాక..ఈ కార్యక్రమం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎస్పీజీ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఇప్పటికే నగరానికి చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది. సమావేశ ప్రాంగణంతోపాటు ప్రధాని, హోంమంత్రి, ఇతర ప్రముఖులు బసచేసే ప్రాంతాలను కూడా ప్రత్యక్షంగా పరిశీలించారు. రాజభవన్ నుంచి హెచ్‌ఐసీసీకి వెళ్లే దారినీ తనిఖీ చేశారు. విడిదికి సంబంధించి సూచనలు చేశారు. సమావేశ ప్రాంగణం చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలను రెండు రోజులపాటు ఆధీనంలోకి తీసుకోనున్నారు.
సమావేశాల దృష్ట్యా ఇప్పటికే భద్రత తనిఖీలు మొదలయ్యాయి. హెచ్‌ఐసీసీ సిబ్బంది వివరాలన్నీ తెప్పించుకున్న పోలీసులు వారి కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత విషయాలన్నింటినీ మదింపు చేస్తున్నారు. భాజపా ప్రముఖుల బసకు అవకాశమున్న ఇతర హోటళ్లలోని సిబ్బంది వివరాలనూ ఆరా తీస్తున్నారు. సమావేశాలు జరిగేటప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా, ఎవరైనా అనారోగ్యానికి గురైనా తక్షణ చికిత్సకు ఆసుపత్రిని సైతం సిద్ధం చేస్తున్నారు. సమావేశ ప్రాంగణంలోనూ అంబులెన్సులు, ఇతర అత్యవసర సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు.
జిల్లాల నుంచి నిపుణులు..వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న రాష్ట్రం కావడంతో మావోయిస్టులను గుర్తించడంలో అనుభవమున్న అధికారుల(స్పాటర్స్)ను జిల్లాల నుంచి రప్పిస్తున్నారు. వీరిని సమావేశ ప్రాంగణం, విడిది ప్రాంతాల్లో మోహరిస్తారు. మరోవంక..మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని అడవుల్లో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
నిఘా నేత్రాలు..ప్రముఖుల విడిది, సమావేశ ప్రాంగణం చుట్టూ ఇప్పటికే ఉన్నవాటికి అదనంగా ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం హెచ్‌ఐసీసీలోనే కమాండ్ కంట్రోల్‌ను నెలకొల్పుతుండగా సైబరాబాద్ కంట్రోల్ రూం నుంచీ వాటిని పర్యవేక్షించనున్నారు. హెచ్‌ఐసీసీ ప్రాంగణం, దానికి దారితీసే రహదారుల్లో అనుమానాస్పద వస్తువులు, వాహనాలు ఉంటే కృత్రిమ మేథ ద్వారా సీసీ కెమెరాలు గుర్తించి భద్రత సిబ్బందిని హెచ్చరించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
రహదారులే ముఖ్యం..సమావేశంలో పాల్గొనే ప్రముఖులు విమానాశ్రయం నుంచి వేర్వేరు సమయాల్లో వారి విడిదికి, అక్కడ నుంచి సమావేశ ప్రాంగణానికి రానున్నారు. ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు బేగంపేట విమానాశ్రయానికి, అక్కడ నుంచి హెచ్‌ఐసీసీకి హెలికాప్టర్‌లోనే వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలం కావడంతో హెలికాప్టర్ ఎగరడానికి ఇబ్బందులు వస్తే రోడ్డు మార్గంలోనే వెళ్లనున్నారు. దాంతో ఈ రహదారుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ముఖ్యంగా పంజాబ్‌లో ప్రధాని ప్రయాణిస్తున్న రహదారిని దిగ్బంధించిన ఉదంతం నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.