తెలంగాణ

telangana

ETV Bharat / city

కష్టకాలంలో సేవచేయడానికి యువవైద్యులు ముందుకు రావాలి: సీఎం - jobs in medical department

The state government has decided to recruit 50,000 medical personnel
The state government has decided to recruit 50,000 medical personnel

By

Published : May 9, 2021, 8:01 PM IST

Updated : May 9, 2021, 9:56 PM IST

19:57 May 09

తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి సీఎం ఆదేశాలు

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను బలోపేతం చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌... కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని యువవైద్యులకు పిలుపునిచ్చారు. కరోనా ఉద్ధృతి పెరుగుతున్న తరుణంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పనిచేస్తున్న వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించేలా ముఖ్యమంత్రి కెసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన 50 వేల మంది యువవైద్యుల్లో అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ, కట్టడికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందుతున్న వైద్యం తదితర అంశాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో అనేక అంశాలు చర్చకు రాగా...వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.

సరైన గుర్తింపునిస్తాం..

రెండు, మూడు నెలల కాలానికి వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సూచించారు. కరోనా వైద్యంలో వారి సేవలను వినియోగించుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులను ఆదేశించారు. వారికి గౌరవప్రదమైన రీతిలో జీతాలు అందించాలన్నారు. కరోనా వంటి  కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరియైన గుర్తింపు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ వెయిటేజీ మార్కులను కలపాలని ఆదేశించారు. ఆసక్తి ఉన్నవారు ఆన్​లైన్(https://odls.telangana.gov.in/medicalrecruitment/Home.aspx) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

తక్షణమే ప్రారంభించండి...

వైద్యులతో పాటు రాష్ట్రంలో అర్హతవున్న నర్సులు, ల్యాబ్​ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించి, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్​స్పెషాలిటీ దవాఖానాను, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్​ లో మరో 250 పడకలతో నిర్మించిన సూపర్​స్పెషాలిటీ దవాఖానాను తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన 729 మందిని నియమించుకోడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పీఎంఎస్‌ఎస్​వై కింద ఎంజిఎంలో నిర్మిస్తున్న సూపర్​స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటాకింద తక్షణం రూ.8 కోట్లు, రిమ్స్‌కు రూ.20 కోట్లు లెక్కన మొత్తం రూ.28 కోట్లను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. వరంగల్ ఆస్పత్రి కోసం 363 వైద్య సిబ్బందిని, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది వైద్యసిబ్బందిని, మెత్తం 729 సిబ్బంది నియామకానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్​డెసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితి గురించి అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమిడిసివర్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్ధంగా ఉంచామని వైద్యారోగ్య శాఖ అధికారులు కేసీఆర్​కు వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెత్తం 7,393 బెడ్లు అందుబాటులో ఉన్నాయని... 2,470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. మందులతోపాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో వున్నాయని పేర్కొన్నారు. ప్రైవేటు దవాఖానాల్లో రెమ్​డెసివర్ ఇంజక్షన్లను మరింతగా అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. 

ఈ సమావేశంలో మంత్రులు తన్నీరు హరీశ్​రావు, ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి , కొవిడ్ సీఎంఓ ప్రత్యేక అధికారి రాజశేఖర్ రెడ్డి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీఎంఈ కె.రమేష్ రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, టీఎస్​ఎంఎస్​ఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, టెక్నికల్ అడ్వైజర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 ఇదీచూడండి:కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ముగ్గురు మృతి

Last Updated : May 9, 2021, 9:56 PM IST

ABOUT THE AUTHOR

...view details