తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana vs Central: ఉప్పుడు బియ్యం... వీడని కయ్యం - కేంద్రం, తెలంగాణ మధ్య ప్రతిష్టంభన

కేంద్రం, తెలంగాణ మధ్య ప్రతిష్టంభన (Telangana vs Central) కొనసాగుతోంది. ఉప్పుడు బియ్యం అదనపు కోటా వ్యవహారం ఇంకా అయోమయంలోనే ఉంది. తాజాగా క్షేత్ర స్థాయిలో నిల్వల తనిఖీకి కేంద్రం నిర్ణయించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎఫ్‌సీఐకి ఆదేశాలు జారీ చేసింది.

The stalemate between the Center and Telangana over the rice affair continues
Telangana vs Central: ఉప్పుడు బియ్యం... వీడని కయ్యం

By

Published : Sep 30, 2021, 7:35 AM IST

ఉప్పుడు బియ్యం వ్యవహారంలో కేంద్రం, తెలంగాణ మధ్య ప్రతిష్టంభన (Telangana vs Central) కొనసాగుతోంది. బియ్యం ఇవ్వాల్సిన గడువు నేటితో ముగియనుండగా అదనపు కోటాపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో ధాన్యం నిల్వలను తనిఖీ చేయాలని కేంద్రం (Central) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ రాసింది.

బస్తాల లెక్కింపునకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను పౌరసరఫరాల శాఖ తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొంది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎఫ్‌సీఐకు ఆదేశించింది. కిందటి యాసంగిలో 92.33 లక్షల మెట్రిక్‌ టన్నుల(ఎం.టి.ల) ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ ధాన్యం నుంచి 60 లక్షల ఎం.టి.ల బియ్యం వస్తాయి. 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉప్పుడు బియ్యం మాత్రమే తీసుకునేందుకు ఎఫ్‌సీఐ ఒప్పందం చేసుకుంది. ఆ మేరకే కేంద్రం పరిమితమైతే రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో కనీసం 50 లక్షల మెట్రిక్‌ టన్నులైనా తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నుంచి మంత్రులు, అధికారులు దిల్లీలో ప్రయత్నాలు చేశారు. తనిఖీల తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రం పేర్కొంది.

గత తనిఖీల్లో 25 వేల మెట్రిక్‌ టన్నుల తేడా

ఇబ్బడిముబ్బడిగా ధాన్యం రావటంతో మిల్లర్లు వాటిని ఎక్కడపడితే అక్కడ నిల్వ చేశారు. వాస్తవానికి మిల్లర్లు చెబుతున్న స్థాయిలో నిల్వలు ఉన్నాయా అన్న అనుమానాలు కేంద్రం నుంచి వ్యక్తం అవుతున్నట్లు సమాచారం. గడిచిన వానా కాలంలో ఎఫ్‌సీఐ అధికారులు తనిఖీ చేస్తే 25 వేల మెట్రిక్‌ టన్నుల వరకు లేవని గుర్తించి, కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బియ్యం అదనంగా తీసుకోవాంటే వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని కేంద్రం భావించినట్లు తెలుస్తోంది.

నేటితో గడువు ముగింపు...

కిందటి యాసంగిలో ఎఫ్‌సీఐ ఒప్పందం చేసుకున్న 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇచ్చేందుకు కేంద్రం ఆరు నెలల వ్యవధి ఇచ్చింది. మంగళవారం వరకు 20.87 లక్షల మెట్రిక్‌ టన్నులే మిల్లర్లు ఇవ్వగలిగారు. ఇంకా 3.88 లక్షల ఎం.టి.లు మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. మరో ఆరు నెలలు గడువు పొడిగించాలని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసింది. కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేదు.

ABOUT THE AUTHOR

...view details