Ukraine War Effect on Medical Students: ఫిబ్రవరి చివరి వారంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక దాదాపు 20 వేల మంది విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరిలో 16 వేల మంది ఎంబీబీఎస్ చదువుతుండగా, మరో 4000 మంది వరకూ ఇంజినీరింగ్ సహా వివిధ కోర్సులు చదువుతున్నారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులను స్థానిక రాష్ట్రాల్లోని విద్యా సంస్థల్లో సర్దుబాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని అప్పట్లో కేంద్రం ప్రకటించింది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆశలు చిగురించాయి. కానీ ఆ దిశగా ఇప్పటివరకూ స్పష్టత లేదు. దీంతో ముఖ్యంగా వైద్య విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. ‘అక్కడి వర్సిటీలు ఆన్‌లైన్ బోధన కొనసాగిస్తున్నప్పటికీ.. అనుకున్నంత ఫలవంతంగా సాగడంలేదు. పైపెచ్చు ప్రాక్టికల్స్‌చేసే వీల్లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని’ వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
3 రాష్ట్రాల్లోనే వెసులుబాటు:మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో స్థానిక కళాశాలలు నిర్వహించే ఆన్‌లైన్ తరగతులకు వారిని అనుమతించేలా ప్రభుత్వాలు అనుమతించాయి. ప్రాక్టికల్స్ చేసేందుకూ వెసులుబాటు కల్పించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికీ ఎన్‌ఎంసీ నిబంధనలు అడ్డంకిగా మారాయి.
ఇతర దేశాలకు బదలాయింపూ కష్టమే: ఉక్రెయిన్ నుంచి ఇతర దేశాలకు బదిలీ చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలూ ఫలించడం లేదు. తాము చదువుతున్న విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలూ లేవు. ప్రస్తుతం సెమిస్టర్ పరీక్షలు నెలాఖరులో జరగనున్నాయి. అవి పూర్తయ్యాక ట్రాన్స్‌స్క్రిప్టులు చేతికి వస్తేనే ఇతర దేశాలకు బదిలీ చేసుకునే వీలుంటుంది. అందుకు ఆయా దేశాలు అనుమతించడమూ అనుమానమేననే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ‘‘ఉదాహరణకు భారత విద్యార్థులను సర్దుబాటు చేయాలంటూ విదేశాంగశాఖ ఉక్రెయిన్‌కు సమీపంలోని వివిధ దేశాలకు లేఖలు రాసింది. అందుకు కజికిస్థాన్‌కు చెందిన ఐదు వర్సిటీలు సానుకూలత వ్యక్తంచేశాయి. అయితే ఉక్రెయిన్‌లో ఆరేళ్ల ఎంబీబీఎస్ కోర్సు ఉండగా, కజికిస్థాన్‌లో అది ఐదేళ్లే. అక్కడ చేరాలంటే విద్యార్థులు అదనపు సబ్జెక్టులు పూర్తిచేయాల్సిన పరిస్థితి. ఇలాంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని’ వారు తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన అపెక్స్ కన్సల్టెంట్ నిర్వాహకుడు హెచ్‌ఎం ప్రసాద్‌ను ‘ఈనాడు- ఈటీవీ భారత్‌ను’ సంప్రదించగా ‘‘ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల ముందు రెండే మార్గాలున్నాయి. ఉక్రెయిన్‌లో పరిస్థితులు చక్కబడే వరకు ఎదురుచూసి తిరిగి వెళ్లి చదువుకోవడం. లేదా ఇతర దేశాలకు బదిలీ చేసుకోవడం. ప్రస్తుత సెమిస్టర్ పూర్తిచేసుకుని ధ్రువీకరణ పత్రాలు చేతికి వస్తేనే బదిలీ సాధ్యపడుతుంది’’ అని ఆయన తెలిపారు.