ఈనెల 4న రుతుపవనాల ప్రవేశంతో తొలకరి వర్షాలు మొదలయ్యాయనే ఆనందంతో రైతులు విత్తనాలు వేస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో వారం రోజులుగా చుక్క వాన పడలేదు. పలు ప్రాంతాల్లో సాధారణంకన్నా చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు జిల్లాల్లో సాధారణంకన్నా చాలా తక్కువ వాన కురిసిందని వాతావరణశాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.
వనపర్తి జిల్లాలో ఈ నెల 1 నుంచి 25 వరకూ సాధారణంగా 102.5 మిల్లీమీటర్ల వర్షం కురవాలి. కానీ ఇప్పటికి అంతకన్నా 63 శాతం తగ్గి కేవలం 37.5 మి.మీ.లే కురిసింది. నాగర్‌కర్నూల్‌లో 55 శాతం, జోగులాంబ గద్వాలలో 45, భద్రాద్రిలో 24, మహబూబ్‌నగర్‌లో 14, వికారాబాద్‌లో 12 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం సాధారణంకన్నా 20 శాతానికి మించి లోటు ఏర్పడితే అక్కడ దుర్భిక్ష పరిస్థితులున్నట్లుగా పరిగణిస్తారు. కొన్ని జిల్లాల్లో సాధారణంకన్నా ఎక్కువ కురిసినట్లు లెక్కలు చెబుతున్నా అదే జిల్లాల్లోని పలు మండలాల్లో వానల్లేవు. ఒక జిల్లాలో ఏదైనా ఒక మండలంలో పెద్దపెట్టున ఒకటీ, రెండు రోజుల్లోనే భారీ వర్షం పడితే ఇక ఆ జిల్లా మొత్తం సాధారణంకన్నా ఎక్కువగా కురిసినట్లు నమోదవుతోంది, కానీ గ్రామాలకెళ్లి చూస్తే వర్షాలు లేవని రైతులు వాపోతున్నారు.
పెరుగుతున్న వేడి
ఒకసారి వర్షం పడిన తరవాత మళ్లీ వారం, పదిరోజులు చినుకులు పడకపోతే మొలక దశలో ఉన్న పంటలు వాడిపోతున్నాయి. రుతుపవనాల కదలికలు లేకపోవడంతో ఆకాశం నిర్మలంగా ఉంటోంది. దీనివల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకి భూ వాతావరణం వేడెక్కుతోంది. శుక్రవారం నల్గొండలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకన్నా 3 డిగ్రీలు అధికం. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 2 డిగ్రీలకు మించి పెరిగితే పైరు మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలకు పైగా పత్తి వేశారు. కేవలం వర్షాలపైనే ఆధారపడి ఈ పంటను సాగు చేస్తారు. మరే విధమైన నీటి వసతి లేనందున ఈ నెలలో కురిసే వర్షాలే పత్తి పంటకు ప్రాణాధారం. కానీ వారం రోజులుగా సరైన వర్షాలు లేనందున పలు పైర్ల మొక్కలు వాడుతున్నాయని రైతులు వాపోతున్నారు.
రేపు అక్కడక్కడా భారీ వర్షాలకు అవకాశం
ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉంది. పశ్చిమ, వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో శనివారం ఒక మాదిరిగా, ఆదివారం తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ఇదీ చూడండి:Vaccination: రాష్ట్రంలో కోటి మార్క్ దాటిన కరోనా టీకా పంపిణీ