రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పల్లె ప్రగతిని జనవరి 2 నుంచి నిర్వహించనున్నారు. 11 రోజుల పాటు ఇది జరగనుంది. మొదటి విడతగా సెప్టెంబరు 6 నుంచి నెల రోజులపాటు నిర్వహించిన కార్యాచరణ ప్రణాళికలోని పనులనే దాదాపుగా ఇప్పుడూ చేపట్టనున్నారు.
జిల్లాల్లో - 50 తనిఖీ బృందాలు
ప్రతి గ్రామానికి ఒక మండలస్థాయి అధికారి, ప్రతి మండలానికి ఎంపీడీవో పర్యవేక్షకులుగా ఉంటారు. మరోవైపు ఇప్పటికే చేపట్టిన పనులెలా ఉన్నాయనేది పరిశీలించి ప్రభుత్వానికి నివేదించేందుకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో 50 తనిఖీ బృందాలు జిల్లాల్లో పర్యటించనున్నాయి.
ప్రగతికి - ప్రణాళిక
- మొదటిరోజు గ్రామసభ నిర్వహణ. మొదటి విడతలోని పల్లెప్రగతిని గ్రామస్థులకు చదివి వినిపించటం. గ్రామంలో వీధులు శుభ్రంగా ఉంచటం, కూలిపోయిన ఇళ్లు, పాడుపడిన పశువుల కొట్టాల శిథిలాల తొలగింపు. పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న బోర్ల మూసివేత. సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపర్చటం.
- దోమల మందు పిచికారీ చేయటం, మురుగుకాలువలను శుభ్రపర్చటం, రోడ్లపై గుంతల పూడ్చివేత. చెత్తను డంపింగ్‌యార్డులకు తరలించి దానిని కంపోస్టు ఎరువుగా వినియోగించేలా చర్యలు. రోడ్లపై చెత్త వేసినవారికి రూ.500జరిమానా విధింపు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డుల నిర్మాణం. పారిశుద్ధ్యకార్మికుల వేతనాలు పెంచినందున వారిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవటం.
- ప్రతి పంచాయతీ విధిగా ట్రాక్టర్ సమకూర్చుకోవటం. చెత్తసేకరణకు, మొక్కలకు నీళ్లు పోయటానికి ట్రాక్టర్‌ను వినియోగించటం. వేలాడుతున్న, వదులుగా ఉన్న విద్యుత్‌వైర్లు, స్తంభాలను సరిచేయటం. తప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు. ఎల్‌ఈడీ లైట్ల అమరిక. వీధిదీపాల సమర్థ నిర్వహణకు మూడోవైర్, ప్రత్యేక మీటరు, స్విచ్‌ల ఏర్పాటు. వీధిలైట్లను శీతాకాలంలో సాయంత్రం 6గం. నుంచి ఉదయం 6.30గం.వరకు, ఇతర సమయాల్లో సా.7గం. నుంచి ఉ.5.30గం. వరకు వేసేలా చర్యలు.
- గ్రామ 2020-21 వార్షిక ప్రణాళికకు గ్రామసభ ఆమోదం పొందటం. ప్రణాళికకు అనుగుణంగా బడ్జెట్ తయారీ. ప్రతి ఇంటికి, ఆస్తికి సరైన విలువను లెక్కగట్టటం. పన్నుల వసూలు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్త బుట్టలు ఉండేలా ప్రోత్సహించటం. గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు. ఇప్పటికే నాటిన పండ్ల మొక్కల సంరక్షణ. పంచాయతీలోని మొక్కల పరిస్థితిపై సమీక్ష. మహిళాసంఘాలు, విశ్రాంత ఉద్యోగులు, యువకులను భాగస్వాములను చేస్తూ శ్రమదాన కార్యక్రమాలు చేపట్టటం.
- సీనియర్ అధికారులతో కూడిన బృందాల ఆకస్మిక తనిఖీ. లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాల అందజేత. అజాగ్రత్త, అలసత్వం వహించిన వారిపై చర్యలు.
ఇవీ చూడండి:పల్లె ప్రగతి'పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: మంత్రి ఎర్రబెల్లి