ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో గులాబ్ తుపాను తీరం దాటిందని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ వెల్లడించారు. సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య తుపాను తీరం దాటిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎక్కువ నష్టం జరగలేదన్న పాలనాధికారి.. నష్టాల వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉందన్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయాయని.. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.
Cyclone Gulab: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటిన గులాబ్ తుపాను
19:06 September 26
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటిన గులాబ్ తుపాను
శ్రీకాకుళంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని కలెక్టర్ చెప్పారు. అన్ని శాఖల అధికారులు తక్షణం పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు నివారణ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఆరుగురు మత్స్యకారుల్లో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరారని చెప్పారు. మత్స్యకారులు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వాసులుగా గుర్తించామన్నారు. ఒక మత్స్యకారుడి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పేర్కొన్నారు.
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సమస్యలు ఎదురైనా కంట్రోల్ రూమ్‌కు తెలపాలి. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నెంబర్: 08942-240557 ఏర్పాటుచేశాం. జిల్లా పోలీసు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్: 6309990933. తుపాను కారణంగా జిల్లా కేంద్రంలో ఇవాళ నిర్వహించనున్న స్పందన కార్యక్రమం రద్దు.'
- శ్రీకాకుళం కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
సంబంధిత కథనాలు: