కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్రపతి ఆమోదంతో అమల్లోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 2018కి అనుగుణంగా ఉద్యోగాల కసరత్తు కొనసాగుతోంది. కొత్త జోనల్ విధానం ప్రకారం రాష్ట్రాన్ని ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లుగా విభజించారు. ఆ జోన్లు, 33 జిల్లాల ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వర్గీకరించాల్సి ఉంది. అన్ని శాఖల్లోని పోస్టులను రాష్ట్ర, మల్టీజోనల్, జోనల్, జిల్లా కేడర్లుగా ఇప్పటికే విభజించారు. ప్రస్తుతం దానికి కొనసాగింపుగా ఆయా జిల్లాల్లో ఉన్న ఉద్యోగాల లెక్కను తేల్చే పనిలో అధికారులు పడ్డారు.
భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా..
సంబంధిత శాఖల్లో కేడర్ వారీగా పనిచేస్తున్న ఉద్యోగులు, ఉన్న ఖాళీలు, తదితర వివరాలను సేకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కచ్చితమైన వివరాలు ఉండేలా సుధీర్ఘ కసరత్తు చేస్తున్నారు. అన్ని శాఖలు గతంలో ఇచ్చిన వివరాలను ఆర్థికశాఖ గత నాలుగు రోజులుగా ఆయా శాఖలతో సమావేశమై ఉద్యోగులు, ఖాళీల వివరాలను సమీక్షించింది. ఇందుకు సంబంధించి పూర్తి స్పష్టత వచ్చాకే.. ఉద్యోగుల విభజనకు సంబంధించిన తదుపరి కసరత్తు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం 2018కి అనుగుణంగా అన్ని నిబంధనలను సవరించాల్సి ఉంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారీగా ఏ పోస్టులు ఎన్ని ఉండాలన్న విషయమై కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత అందుకు అనుగుణంగా ఉద్యోగాలు, ఉద్యోగుల కేటాయింపులు చేయాలి. 33 జిల్లాలకు ఉద్యోగుల పంపకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఉద్యోగులకు ఐచ్చికాలు ఇవ్వాలని, సీనియార్టీని ప్రాతిపదిక తీసుకోవాలని ఉద్యోగసంఘాలు కోరుతున్నాయి. ఆ తర్వాతే ఉద్యోగులను జిల్లాల వారీగా శాశ్వత కేటాయింపులు చేయాలని అంటున్నారు.