తెలంగాణ

telangana

ETV Bharat / city

wow startup: వావ్ అంకుర సంస్థ.. ‘అరె మామా... మనం సేమ్‌ కాలేజీరా!’ - తెలంగాణ వార్తలు

‘అరె మామా... మనం సేమ్‌ కాలేజీరా!’- హ్యాపీడేస్‌ సినిమా క్లైమాక్స్‌లోని ఈ డైలాగ్‌ గుర్తుందా. ఇంటర్వ్యూలో జూనియర్‌ ఇబ్బంది పడుతుంటే సీనియర్‌ సాయం చేసి ఈ మాట అంటాడు. ఇలా నిజ జీవితంలోనూ తాము చదివిన కాలేజీలో చదువుకున్నవారిని మనవాళ్లే అనుకుంటూ తోచిన సాయం చేస్తుంటారు సీనియర్లు. ఆ సాయానికి ఓ పకడ్బందీ వేదికను కల్పిస్తోంది ‘వావ్‌’ అంకుర సంస్థ.

wow startup, alumni startup organization
వావ్ అంకుర సంస్థ, పూర్వవిద్యార్థుల సంస్థ సాయం

By

Published : Oct 24, 2021, 10:23 AM IST

‘సర్‌... నాకు ఐదు బ్యాక్‌లాగ్స్‌ ఉన్నాయి. నేను యూఎస్‌ఏలో మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నా ఏం చేయాలి?’ ఈ ప్రశ్నని రవి తన కాలేజీ అలమ్నైలో పోస్ట్‌ చేశాడు. వెంటనే బోలెడంత మంది దానికి సూచనలూ, సలహాలూ ఇచ్చేశారు.‘మన కాలేజీలో సరైన వసతులు లేవు. బాగుచేయాలంటే రూ.20 లక్షలు కావాలి. మీకు తోచినంత సాయం చేయగలరా?’ అని గీత తను చదువుతున్న కళాశాల పూర్వవిద్యార్థి సంఘం సైట్‌లో ఫండ్‌రైజింగ్‌ రిక్వెస్ట్‌ పెట్టగానే నెలరోజుల్లో ఆ డబ్బు సమకూరిపోయింది. ఇవే కాదు... కెరీర్‌ విషయంలో సలహాలు ఇవ్వడం, విదేశీ విద్యాభ్యాసానికి వెళ్లే వారికి తోడ్పాటునందించడం, పోటీ పరీక్షలకు వెళ్లే వారికి సాయం చేయడం లాంటివి ఎన్నో ‘వావ్‌’ వేదికల్లో జరుగుతుంటాయి.

సాధారణంగా మనం క్లాస్‌మేట్స్‌తో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ గ్రూపుల్ని ఏర్పాటు చేసుకుంటాం కదా. అది కొంతమంది వరకే కుదురుతుంది. అదే మనం చదువుకున్న స్కూలో, కాలేజీలో చదివిన, చదువుకున్న వందలాది విద్యార్థులంతా ఒకచోట కనెక్ట్‌ కావాలంటే కాస్త కష్టమే. ఈ వావ్‌ స్టార్టప్‌ అదే పనిని సులువుగా చేసేస్తుంది. విద్యాసంస్థల పూర్వవిద్యార్థులందరితో నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి ఇస్తుంది. ఇదో సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ లాంటిదే. దీని ద్వారా విద్యాసంస్థలు తమ కాలేజీకి అలమ్నై వెబ్‌సైట్‌ రూపొందించుకోవచ్చన్నమాట. కాలేజీలో అందుబాటులో ఉన్న విద్యార్థుల వివరాలన్నీ అందులో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఆయా విద్యార్థులే ఆ వెబ్‌సైటుకు ప్రచారం కల్పిస్తారు. ఇలా ఆ విద్యాసంస్థ పూర్వ విద్యార్థుల మధ్య అనుసంధానం ఏర్పడుతుంది. ఒకసారి ఈ పూర్వవిద్యార్థి సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో విషయాల్లో ఒకరికొకరు సాయం చేసుకుంటారు. అప్పటికే ఉన్నతస్థాయిలో ఉన్న ఆ కాలేజీ పూర్వ విద్యార్థుల ద్వారా కెరీర్‌, ప్లేస్‌మెంట్స్‌ విషయాల్లో గైడెన్స్‌ అందుతుంది. ఇంకా కాలేజీ వసతుల కోసం విరాళాలు, స్టార్టప్స్‌ ఆలోచనతో ముందుకొచ్చే విద్యార్థులకు మెంటరింగ్‌, పెట్టుబడి అందే అవకాశం దొరుకుతుంది. ఒక్కో కాలేజీకి చెందిన అలమ్నై వెబ్‌సైట్‌ తయారుచేసివ్వడమే కాకుండా అన్ని విద్యాసంస్థలకు ఉపయోగపడేలా జాబ్‌ రిక్రూట్‌మెంట్స్‌కు సంబంధించిన ప్రత్యేకమైన క్లాసుల్నీ నిపుణులతో చెప్పిస్తోందీ సంస్థ.

మొత్తం 15 లక్షలమంది!

ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకూ 1000కి పైగా విద్యాసంస్థలు పూర్వవిద్యార్థి సంఘాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. వీటిల్లో అన్ని కళాశాలల సైట్లలో కలిపితే మొత్తం 15 లక్షల మందికి పైగా పూర్వ విద్యార్థులు ఉన్నారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(IISC), ఆరు ఐఐఎంలూ, ఐదు ఐఐటీలూ, 11 ఎన్‌ఐటీలతోపాటు ఇంకా వందలాది ప్రముఖ ఇంజినీరింగ్‌ కాలేజీలూ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే సీబీఐటీ, ఎంజీఐటీ, ఓయూ కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జేఎన్‌టీయూ, కేఐటీఎస్‌ వరంగల్‌ వంటివెన్నో ఈ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేసుకున్నాయి. మనదేశంలోనే కాదు, ఆస్ట్రేలియా, మలేషియా, జపాన్‌, శ్రీలంక ఇలా మొత్తం 18 దేశాల్లోనూ ‘వావ్‌’ అలమ్నై నెట్‌వర్క్‌ నడుస్తోందట. దీని వల్ల అవసరమైన పాఠశాలలూ, కాలేజీలకూ నిధుల సమీకరణ ద్వారా రూ.8 కోట్లు అందాయట. నెలకు 2 వేల మంది ఉద్యోగాల్లో చేరుతున్నారట. మొన్న కరోనా కష్టకాలంలో 250కిపైగా అలమ్నై ఆన్‌లైన్‌ సెషన్స్‌ ఏర్పాటు చేస్తే లక్షన్నర మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.

ఎవరి ఆలోచన?

ఈ సంస్థ వ్యవస్థాపకుడు పరేశ్‌ మసాదే. ఆదిలాబాద్‌లోని గ్రామీణ పాఠశాలలో చదువుకున్నాడు. అదే స్కూలు పూర్వవిద్యార్థులు ఉన్నతస్థానాల్లోకి చేరడం తెలిసి వాళ్లు చేసే చిన్న సాయంతో ఆ బడి రూపురేఖల్ని మార్చొచ్చు అనుకున్నాడట. ఆ తర్వాత ముంబయిలో మాస్టర్స్‌ చేసినప్పుడు కూడా అక్కడి పూర్వ విద్యార్థుల సాయం వల్ల జరిగిన మేలును గమనించాడు. అప్పటికే ఉన్నతస్థానాల్లోకి వెళ్లిన సీనియర్లు తమ కాలేజీలో చదివిన జూనియర్లకు ఏ సాయం కావాల్సి వచ్చినా సాధ్యమైనంతవరకూ చేస్తారనేది నిజం. అయితే దానికి సరైన వేదిక కల్పించాలనే ఆలోచనతో ఈ అంకుర సంస్థను 2011లో ఫ్రెండ్స్‌ యశస్వి పీసపాటి, జైపాల్‌ రెడ్డి కదారిలతో కలిసి ప్రారంభించాడు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటూ పూర్వవిద్యార్థుల సాయంతో దాదాపు మూడు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారట. తమ ఆలోచనకు ప్రాణం పోయడానికి మొదట్లో వందలాది విద్యాసంస్థలకు వెళ్లేవారట. నెమ్మదిగా విద్యాసంస్థలు ‘వావ్‌’ పూర్వవిద్యార్థి సంఘాల్లోకి చేరడం ప్రారంభించాయి. అలా 2014 నుంచి అనేక సంస్థలు చేరుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ అంకుర సంస్థ ఏడాదికి దాదాపు రూ.6 కోట్ల టర్నోవర్‌తో నడుస్తోంది.

ఇదీ చదవండి:Huzurabad by election 2021: గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థుల ధీమా.. ఎవరు ఏమంటున్నారంటే..!

ABOUT THE AUTHOR

...view details