ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో వింత వ్యాధి బాధితులు తగ్గినా.. వ్యాధి కారణాలు మాత్రం ఇంకా నిర్ధరణ కాలేదు. గత 5 రోజులతో పోల్చితే ..ఆరో రోజు బాధితుల సంఖ్య బాగా తగ్గింది. వందల్లో నమోదైన కేసులు.. ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరాయి. విద్యానగర్, శాంతినగర్, పెన్షన్ కాలనీ, ఆర్‌ఆర్‌పేట, పవర్‌పేట, అశోక్‌నగర్, కొత్తపేట, తూర్పువీధి, పడమర వీధి, తంగెళ్లమూడి, చోడిదిబ్బ ప్రాంతాల్లో కొత్త కేసులు వచ్చాయని వైద్యులు తెలిపారు.
సీఎస్ పరామర్శ
ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బాధితులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఏ నీళ్లు తాగుతున్నారని వ్యాధి గ్రస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె నగరంలో పారిశుద్ధ్య పరిస్థితిపై ఆరా తీశారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి..అధికారులతో మాట్లాడారు. పలు సూచనలు చేశారు..
వింత వ్యాధి కారణాలు నిగ్గు తేల్చేందుకు పలు జాతీయ సంస్థలు నగరంలో పరిశోధనలు సాగిస్తున్నాయి. బాధితుల రక్తనమానాలు, తాగునీరు, పాలు, కూరగాయాల నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇందులో భార లోహలైన సీసం, నికెల్ ఉన్నట్లు ...దిల్లీ ఎయిమ్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నివేదికలో తేలింది. శరీరంలో ఉన్న సీసం, నికెల్‌కు ఆర్గానో క్లోరిన్ కలిసినప్పుడు మూర్ఛ వస్తోందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. నగరానికి తాగు నీటిని అందించే పంపుల చెరువు సమీపంలో అధిక వింత వ్యాధి బాధిత కేసులు నమోదైనట్లు వైద్య వర్గాల పరిశీలనలో వెల్లడైంది. ఈ నీరు ముందుగా వెళ్లే …పత్తేబాద, అశోక్ నగర్, ఒకటో పట్టణం ప్రాంతాల్లో అధిక కేసులు వచ్చినట్లు అధికారులు కనుగొన్నారు.