Telangana High Court New Judges : అమ్మాయికి పెళ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందనుకున్నారు ఆ తల్లిదండ్రులు. వారి మాటకు కట్టుబడి పెళ్లి చేసుకున్నారు. ఆ వెంటనే పిల్లలు. తర్వాత.. ఇంతేనా జీవితం అనిపించింది వారికి. కుటుంబ బాధ్యతలు తప్ప మనకంటూ ఓ లక్ష్యం ఉండదా అనుకున్నారు. తమకేం చేయాలనుందో బాగా ఆలోచించారు. వారందరిలో మెదిలింది ఒకటే సామాన్యులకు న్యాయం అందించడం. ఆశయమేంటో తెలియడమే ఆలస్యం ఆ వైపుగా ఓ అడుగేశారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు.. మరోవైపు తమ కలను సాకారం చేసుకోవడానికి రాత్రింబవళ్లు శ్రమించారు. చివరకు తామనుకున్నట్లుగానే న్యాయవృత్తిలో రాణించారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా రాబోతున్నారు. వైవాహిక జీవితం నుంచి కోర్డు మెట్ల దాకా వారి ప్రయాణం గురించి వారి మాటల్లోనే..
Telangana High Court New Judges
By
Published : Mar 24, 2022, 7:08 AM IST
Telangana High Court New Judges : వీరందరికీ చిన్న వయసులోనే పెళ్లయింది... ఆ వెంటనే పిల్లలు. అయినా చదివారు. కుటుంబాన్ని చూసుకుంటూనే... వృత్తిలో రాణించారు. వీరిని నడిపించిందొకటే... సామాన్యులకు న్యాయం అందించాలన్న తపన. సంకల్ప సాధనకు వయసు, బాధ్యతలు అడ్డుకాదని నిరూపించిన వీరంతా తెలంగాణా హైకోర్టులో అడుగుపెట్టబోతున్న న్యాయమూర్తులు... ఈనాడు-ఈటీవీ భారత్‌తో వారి ప్రస్థానాన్ని పంచుకున్నారీ మార్గదర్శులు..
జడ్జి వాళ్లిద్దరి కల..
Telangana High Court New Lady Judges : నా కూతురు ఎప్పటికైనా జడ్జి అవుతుందని అమ్మ అందరికీ చెబుతుండేది. అది చూడకుండానే ఆమె వెళ్లిపోయింది. ఇది తనతోపాటు మా బాబు కల కూడా. మాది హైదరాబాద్. డిగ్రీ మొదటి సంవత్సరంలోనే పెళ్లైంది. ఏడాదికే బాబు. అయినా చదువు కొనసాగించా. దీనికి మావారి ప్రోత్సాహమెంతో. ఆర్థికంగా స్థిరపడే వృత్తులున్నా.. న్యాయవాదిగానే కొనసాగాలనుకున్నా. ప్రతిదాన్నీ పట్టుదలగా తీసుకునేదాన్ని. మా సీనియర్ ‘కేసు ఎలా వాదించాలో నా కూతురికే చెప్పలేదు. నీకూ అంతే’ అని ఫైలు చేతికిచ్చేవారు. నేనూ దాన్నో సవాలుగా తీసుకుని వాదించేదాన్ని. ఈ నా తత్వాన్ని చూసి మా సీనియర్ బార్ కౌన్సిల్ న్యాయవాదుల ప్యానెల్‌కు సిఫారసు చేశారు. దీంతో వృత్తిలోకి వచ్చిన రెండేళ్లకే బార్ కౌన్సిల్ తరఫున వాదనలు వినిపించగలిగా. నా వరకూ.. ఆదాయంతో నిమిత్తం లేకుండా నిజాయతీగా పనిచేస్తూ వచ్చా. బాధపడిన సందర్భాలున్నా మక్కువతో అధిగమించా. విజయానికి దగ్గరి దారులుండవు. వంద శాతం అంకిత భావం, నిబద్ధతతోపాటు మనస్సాక్షిగా శక్తి సామర్థ్యాల మేరకు పని చేస్తే ఫలితం తప్పక వస్తుంది.
అందుకే కష్టమనిపించదు..
Telangana High Court New Women Judges : డాక్టర్ కావాలనుకుని లాయర్‌నయ్యా. ఇంటర్ కాగానే వివాహమైంది. మాది నిర్మల్. మావారు శ్రీహరిరావు న్యాయవాది అవడంతో నేనూ ఆ దిశగా వెళ్లా. చదువుకు పెళ్లి అడ్డు కాకూడదనుకున్నా. పెద్దమ్మాయి పుట్టినపుడు డిగ్రీలో, రెండో అమ్మాయికి ఆరు నెలలప్పుడు లాలో చేరా. వాళ్లు నిద్రపోయాక చదువుకునే దాన్ని. రెండో పాప స్కూలు, నేను కోర్టుకు వెెళ్లడం ఒకేసారి మొదలయ్యాయి. నిర్మల్‌లోనే ప్రాక్టీస్ ప్రారంభించా. అప్పుడు మహిళలకు మరుగుదొడ్డి సౌకర్యమూ ఉండేది కాదు. ఏడేళ్ల తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్‌లో చేశా. జిల్లా బార్ అసోసియేషన్‌లో రెండో మహిళను, నిర్మల్‌లో మొదటి మహిళా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ని. జిల్లాలో పనిచేయడం వల్ల గ్రామీణ ప్రజలతో ఎక్కువ మాట్లాడే, కేసులు తీసుకునే వీలుండేది. అదే నాకు సాయపడింది. నాన్న, మావారి ప్రోత్సాహమే నన్నిక్కడ నిలబెట్టాయి. మా ఆయన ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారు. మా పిల్లల్లో ఒకరు వైద్యవృత్తిలో ఉంటే మరొకరు న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నారు. ఇల్లు, వృత్తి రెంటినీ సమన్వయం చేసుకుంటూ వచ్చా. ఇష్టంతో చేశా కాబట్టే కష్టమనిపించలేదు. పురుషాధిక్య రంగమే అయినా మహిళలకూ అవకాశాలున్నాయి. లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కష్టపడితే రాణించగలం. పైగా నైపుణ్యంతో, కష్టపడి పనిచేసే సామర్థ్యం మన మహిళలకే ఎక్కువ.
సీనియర్ల మాటలే వేదంగా..
Telangana High Court Lady Judges : మాది శ్రీకాకుళం జిల్లా పాలకొండ. నాన్న డాక్టర్ ఎన్.కృష్ణచంద్రరావు, అమ్మ మహాలక్ష్మి. నన్ను డాక్టర్ని చేయాలనుకున్నారు నాన్న. కానీ నా లక్ష్యం మరోలా సాగింది. ఇంటర్ అయిన వెంటనే పెళ్లి. మావారు లక్ష్మణరావు వ్యాపారవేత్త. ఆయన సహకారంతోనే విశాఖపట్టణంలోని ఎన్‌బీఎం లా కాలేజీలో డిగ్రీ చదివి, తర్వాత ఎల్‌ఎల్‌ఎం చేశా. నాకో బాబు. వాడిని అమ్మావాళ్లు చూస్తాననడంతో ప్రాక్టీస్ మొదలుపెట్టా. మొదట్లో లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున కేసులు ఉచితంగా వాదించేదాన్ని. ఏ కోర్టులో ఏ చిన్న కేసు వచ్చినా వెళ్లేదాన్ని. జడ్జి పోస్టుకు ఉన్న గౌరవాన్ని గుర్తించి... మేజిస్ట్రేట్ పోస్టు కోసం పరీక్షలు రాశా. ఇంటర్వ్యూ లో విఫలమయ్యా. తర్వాత నేరుగా జిల్లా జడ్జి పోస్టు కోసం పరీక్షలు రాసి విజయం సాధించా. కొన్నాళ్లు ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా పనిచేశా. 2008లో జిల్లా జడ్జ్జిగా ఎంపికయ్యా. వ్యాట్ ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నా. ‘డబ్బుకంటే జ్ఞానం ముఖ్యం’ అన్న మా సీనియర్ల మాటలే నన్ను ముందుకు నడిపించాయి.
మత్స్యకారుల కేసులు ఉచితంగా వాదించేదాన్ని..
Telangana High Court Women Judges : మాది విశాఖపట్టణం. నాన్న మాటూరి అప్పారావు, అమ్మ నాగరత్నమ్మ. ‘నా చదువుకు అడ్డు చెప్పకూడదు’ అన్న షరతుపైనే ఇంటర్ తర్వాత పెళ్లికి ఒప్పుకొన్నా. అనుకున్నట్టుగానే డిగ్రీతోపాటు ఎమ్మే పాలిటిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీల్లో పీజీ చేశా. బ్యాంకు మేనేజర్ ఉద్యోగం వచ్చినా వెళ్లలేదు. పదిమందికీ ఉపయోగపడుతుందని న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టా. విశాఖ ఎన్‌బీఎం లా కాలేజీలో డిగ్రీ చేసి.. లేబర్ అండ్ ఇండస్ట్రీ లాలో పీజీ చేశా. నాన్న ఎందరో పేద పిల్లలకు చదువులు చెప్పించేవారు. ఆయన సేవా భావాన్ని అలవరచుకుని రోటరీక్లబ్, న్యాయవాద పరిషత్‌లలో సేవా కార్యక్రమాలు చేసేదాన్ని. లీగల్ సర్వీసెస్ తరఫున, విశాఖపట్టణంలో మత్స్యకారుల కేసులనీ ఉచితంగా వాదించేదాన్ని. అక్క సలహాతో జిల్లా జడ్జి పోస్టుకు పరీక్ష రాసి ఎంపికయ్యా. 30 ఏళ్లుగా కుటుంబానికి, వృత్తికి సమ ప్రాధాన్యం ఇస్తూ వచ్చా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా ప్రధాన జడ్జిగా చేస్తున్నా. మావారు విజయ్‌కుమార్ హెచ్‌పీసీఎల్‌లో పనిచేసేవారు. నేను ఉద్యోగ రీత్యా వివిధ జిల్లాలకు వెళ్లాల్సి వస్తుండటంతో ఆయన రాజీనామా చేసి వ్యాపారం ప్రారంభించారు. పెళ్లయ్యాకే సంగీతం, శాస్త్రీయ నృత్యం నేర్చుకున్నా. ఆడపిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నపుడే ముందుకు వెళ్లగలుగుతారు.