munugode by election: రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ప్రచార హోరు తారస్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు నామినేషన్లు, అభ్యర్థుల ప్రచారాలతో సాగిన ఉపపోరు.. ఇక ముఖ్య నేతల పర్యటనలు, బహిరంగసభలతో మరింత వేడెక్కనుంది. మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించాలని పార్టీలు భావిస్తున్నాయి.
తెరాస ఎన్నికల వ్యూహం..ఎన్నికల నోటిఫికేషన్ నుంచే కార్యక్షేత్రంలో నిమగ్నమైన అధికార తెరాస.. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలను ఊరూరా మోహరించింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సంస్థాన్ నారాయణపూర్ మండలంలో మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి.. పార్టీ అభ్యర్థి కూసుకుంట్లతో కలిసి ప్రచారం నిర్వహించారు. మల్లారెడ్డిగూడెం, గుజ్జ, అల్లందేవ్‌చెరువు గ్రామాలకు వెళ్లి.. ఓట్లు అభ్యర్థించారు. నాంపల్లి మండలం రాజ్యతండాలో ఎంపీ మాలోతు కవిత.. చల్లవానికుంటలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రచారం చేశారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి ప్రచారం నిర్వహించారు. రాజగోపాల్‌రెడ్డి స్వార్థంతోనే ఈ ఉపఎన్నిక వచ్చిందన్న మల్లారెడ్డి.. ఆయన ఓడిపోవటం ఖాయమని జోస్యం చెప్పారు.
రాజగోపాల్‌రెడ్డి స్వార్థంతోనే ఉపఎన్నిక వచ్చింది. ఆయన ఓడిపోవడం ఖాయం. మునుగోడు అభివృద్ధికి కేంద్రం నుంచి 200 కోట్లు రూపాయలు అయిన తెగలవా.. నీ కాంట్రాక్టులను కాపాడుకోవడానికే ఈ ఉప ఎన్నిక తెచ్చావు. ఎక్కడ నుంచి నీకు ఇన్ని డబ్బులు వచ్చాయి. ఇంత లగ్జరీగా గడుపుతున్నావు కదా. -మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి
కాంగ్రెస్ నాయకత్వం.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మునుగోడు బాట పట్టింది. రాహుల్‌గాంధీ పాదయాత్ర కోసం ఏర్పాట్లలో నిమగ్నమైన ఆ పార్టీ నేతలు.. నిన్న పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ సందర్భంగా కదలొచ్చారు. చండూరులో రేవంత్‌రెడ్డి సమక్షంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలను స్రవంతి సమర్పించారు. అంతకుముందు బంగారిగడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురైన పాల్వాయి స్రవంతి.. నామినేషన్ కార్యక్రమంలో తన తండ్రి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు చారిత్రక అవసరమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి ధనదాహంతో కాంగ్రెస్ చంపేయాలని చూస్తున్నారని.. డబ్బు సంచులతో వస్తున్న భాజపా, తెరాస నేతల కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కోరారు.