Harish Rao on Police Recruitment: రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీచేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. వాటిని పక్కాగా పూర్తి చేయాలని భావిస్తోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామని.. కేంద్రంలో ఉన్న 15 లక్షల పైగా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. పటాన్‌చెరు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సౌజన్యంతో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు.
సంగారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. పోలీస్, అగ్నిమాపక, అటవీ శాఖల్లో 20 వేల ఉద్యోగాలున్నాయని, వీటికి సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 91 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కేంద్రం ఉద్యోగాలను భర్తీ చేయకుండా జాప్యం చేస్తోందని విమర్శించారు. ధరలు పెంచడంతో పాటు ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు పాదయాత్ర చేస్తున్నారా అని సంజయ్‌ను ప్రశ్నించారు. ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, బండి సంజయ్, కిషన్‌రెడ్డిలను ఖాళీల భర్తీపై ప్రశ్నించాలన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గంలో రూ.50 లక్షలు వెచ్చించి 90 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టడీ మెటీరియల్ అందించనున్నారని తెలిపారు.