హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. ఇదే కాలనీలో నిన్న అదృశ్యమైన చిన్నారి.. పక్కనే నివసించే రాజు అనే వ్యక్తి ఇంట్లో అర్ధరాత్రి విగతజీవిగా కనిపించింది. అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి చెందడంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. బాలికపై రాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. రాజును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు చంపాపేట్ రహదారిపై కాలనీవాసులు ధర్నాకు దిగారు. బాలికను హత్య చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు.
విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. కాలనీవాసులకు నచ్చజెప్పే క్రమంలో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పోలీసులపై రాళ్లు రువ్వారు. స్థానికుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
కలెక్టర్ పరామర్శ..
బాధిత కుటుంబాన్ని హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.50 వేల చెక్ అందించారు. ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని.. రెండు పడక గదుల ఇల్లు, పొరుగు సేవల ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. సింగరేణి కాలనీలో బెల్ట్ షాపులు, గుడుంబా లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.